టీ20 వరల్డ్ కప్-2024లో సూపర్-8 రేసు హీటెక్కింది. లీగ్ మ్యాచ్‌లు ప్రారంభమై పది రోజులు దాటడంతో తదుపరి దశ సమీకరణాలు ఖరారయ్యాయి. అయితే అనూహ్యంగా కొన్ని పసికూన జట్లు సూపర్-8 రేసులో ముందంజలో ఉన్నాయి. మరోవైపు స్ట్రాంగ్ టీమ్స్ అయిన ఇంగ్లండ్, పాకిస్థాన్, న్యూజిలాండ్ ముంగిట సవాళ్లు నిలిచాయి. ఈ నేపథ్యంలో గ్రూప్-సీ, గ్రూప్-డీలోని జట్లకు ఎంతెంత అవకాశం ఉందో చూద్దాం!!
ఏంటీ సూపర్-8?
ఈ సారి పొట్టి కప్‌లో ఇరవై జట్లు బరిలోకి దిగాయి. నాలుగు గ్రూప్‌లు విడిపోయి తలపడుతున్నాయి. అయితే ఆయా గ్రూప్‌ల్లో నిలిచిన టాప్-2 జట్లు సూపర్-8కు అర్హత సాధిస్తాయి. తదుపరి దశకు చేరుకునే ఈ ఎనిమిది జట్లు సెమీఫైనల్స్ బెర్తు కోసం నాలుగు జట్ల చొప్పున రెండు గ్రూప్‌లు విడిపోయి పోటీపడతాయి. A1, B2, C1,D2 ఒక గ్రూప్‌లో, A2, B1, C2,D1 మరో గ్రూప్‌లో ఉంటాయి. (A1, A2 అంటే గ్రూప్-ఏలో తొలి రెండు స్థానాల్లో నిలిచే జట్లు)

గ్రూప్-సీలో అవకాశాలు ఎలా ఉన్నాయి?
అఫ్గానిస్థాన్ (4 పాయింట్లు, +5.225 NRR): పపువా న్యూ గినియా, వెస్టిండీస్‌తో జరగనున్న మ్యాచ్‌ల్లో ఓ విజయం సాధిస్తే అఫ్గాన్ సునాయాసంగా సూపర్-8కు అర్హత సాధిస్తుంది. ఒకవేళ విండీస్, కివీస్‌తో సమానమైన పాయింట్లు సాధించినా మెరుగైన నెట్‌రేటు ఉన్న అఫ్గానిస్థాన్ సులువుగానే క్వాలిఫై అవుతుంది.
వెస్టిండీస్ (4 పాయింట్లు, +3.574 NRR): అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్‌తో జరగనున్న మ్యాచ్‌ల్లో ఒక్కటి గెలిచినా వెస్టిండీస్ సూపర్-8 బెర్త్ ఈజీగా కన్ఫార్మ్ అవుతుంది. కివీస్‌పై నెగ్గి, అఫ్గాన్ చేతిలో ఓడితే నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా అర్హత సాధిస్తుంది.
ఉగాండ (2 పాయింట్లు, -4.214 NRR): న్యూజిలాండ్‌పై ఉగాండ భారీ విజయం సాధించాలి. అంతేగాక ఇతర ఫలితాలపై ఆధారపడాలి.
పపువా న్యూ గినియా (0 పాయింట్లు, -0.434 NRR): అఫ్గానిస్థాన్, న్యూజిలాండ్‌పై గెలిచి ఇతర ఫలితాలపై పపువా న్యూ గినియా ఎదురుచూడాలి. ఆడిన రెండింట్లో ఓడిన పపువా సూపర్-8కు చేరడం కష్టమే.
న్యూజిలాండ్ (0 పాయింట్లు, -4.200 NRR): మిగిలిన మూడింట్లో న్యూజిలాండ్ గెలవాలి. వెస్టిండీస్, ఉగాండ, పపువా న్యూ గినియాపై ఘన విజయాలు సాధించాలి. నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా నేరుగా అర్హత సాధించాలంటే అఫ్గానిస్థాన్ చేతిలో వెస్టిండీస్ ఓడిపోవాలి.
గ్రూప్-డీలో అవకాశాలు ఎలా ఉన్నాయి?
దక్షిణాఫ్రికా (6 పాయింట్లు, +0.603 NRR): ఇప్పటికే సౌతాఫ్రికా సూపర్-8 బెర్త్ ఖరారు చేసుకుంది. తమ చివరి మ్యాచ్‌లో సౌతాఫ్రికా ఓడినా గ్రూప్-డీలో మరో జట్టు ఆరు పాయింట్లు సాధించే అవకాశం లేకపోవడంతో దక్షిణాఫ్రికా తదుపరి దశకు చేరుకుంది. అయితే తొలి రెండు స్థానాల్లో ఏ స్థానంతో లీగ్ స్టేజ్ ముగిస్తుందనేది ఆసక్తికరం.
బంగ్లాదేశ్ (2 పాయింట్లు, +0.075 NRR): నెదర్లాండ్స్‌పై విజయం సాధించడం బంగ్లాదేశ్‌కు చాలా కీలకం. అలాగే నేపాల్‌తో జరిగే మ్యాచ్‌లో గెలిస్తే బంగ్లా పులులు సూపర్-8కు చేరుతాయి
నెదర్లాండ్స్ (2 పాయింట్లు, +0.024 NRR): బంగ్లాదేశ్, నేపాల్‌తో జరిగే మ్యాచ్‌ల్లో నెదర్లాండ్స్ విజయం సాధిస్తే నేరుగా అర్హత సాధిస్తుంది.
నేపాల్ (0 పాయింట్లు, -0.539 NRR): నెట్‌రన్‌రేటుతో సంబంధం లేకుండా నేపాల్ క్వాలిఫై కావాలంటే శ్రీలంక, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌ను ఓడించాలి.
శ్రీలంక (0 పాయింట్లు, -0.777 NRR): దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ చేతిలో ఓడిన శ్రీలంక సూపర్-8కు అర్హత సాధించాలంటే మిగిలిన మ్యాచ్‌ల్లో నేపాల్, నెదర్లాండ్స్‌పై నెగ్గాలి. అంతేగాక మిగిలిన ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.