
దుబాయ్: సరిగ్గా రెండేళ్ల కిందట తమకు ఎదురైన పరాభవానికి ఇంగ్లండ్‌పై న్యూజిలాండ్ ప్రతీకారం తీర్చుకుంది. కల చెదిరిపోయిన క్షణాన్ని మనసులో పెట్టుకున్న కివీస్.. గోడకు కొట్టిన బంతిలా తిరిగొచ్చింది. బుధవారం రాత్రి అబుదాబిలో ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన టీ20 ప్రపంచకప్ తొలి సెమీ ఫైనల్లో ఇంగ్లండ్‌పై కివీస్ అద్భుత విజయం సాధించింది. ఓ దశలో ఓటమి ఖాయం అనుకున్నా.. న్యూజిలాండ్ ఆటగాళ్ల అద్భుత పోరాటం ఆ జట్టును విజయతీరాలకు చేర్చింది. కీలక సమయంలో జేమ్స్ నీశమ్ చెలరేగగా.. డారెల్ మిచెల్ అజేయ అర్ధ సెంచరీతో జట్టును విజయతీరాలకు చేర్చాడు. దాంతో పొట్టి ఫార్మాట్‌లో తొలిసారి న్యూజిలాండ్ ఫైనల్లోకి దూసుకెళ్లింది.
కెప్టెన్ కేన్ విలియమ్సన్ సమర్థ నాయకత్వం వల్లే న్యూజిలాండ్ గొప్ప విజయాలు సాధిస్తోందని టీమిండియా బ్యాటింగ్ దిగ్గజం సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు. ప్రస్తుత టీ20 ప్రపంచకప్‌లో కివీస్ సమష్టిగా రాణిస్తూ ముందుకు సాగుతోందన్నాడు. జేమ్స్ నీషమ్ తన ప్రతిభకు న్యాయం చేసినందుకు సంతోషంగా ఉందని సన్నీ అన్నాడు. నీషమ్ 11 బంతుల్లో 27 పరుగులు చేసి కివీస్ విజయంలో కీలకపాత్ర పోషించిన విషయం తెలిసిందే. క్రిస్ జోర్డాన్ వేసిన 17వ ఓవర్లో జేమ్స్ నీషమ్ రెచ్చిపోయాడు. 17వ ఓవర్ తొలి బంతికి సిక్స్ బాదిన నీషమ్.. మూడో బంతిని ఫోర్‌గా మలిచాడు. ఆ తర్వాతి బంతికే మరో భారీ షాట్‌కు ప్రయత్నించి బౌండరీ వద్ద ఉన్న జానీ బెయిర్‌స్టోకి చిక్కాడు. అయితే బంతిని చేతుల్లోకి తీసుకున్న జానీ.. బ్యాలెన్స్ కోల్పోయి బౌండరీ లైన్‌ను తాకడంతో అంపైర్ నాటౌట్‌గా ప్రకటించాడు. అంతేకాదు అది సిక్సర్‌గా కలిసొచ్చింది. దీంతో ఆ ఓవర్లో నీషమ్ రెండు సిక్సులు, ఓ ఫోర్ సహా మొత్తం 23 పరుగులు పిండుకున్నాడు.
తాజాగా ఓ జాతీయ మీడియాతో సునీల్ గవాస్కర్ మాట్లాడుతూ... 'జేమ్స్ నీషమ్ 8-9 సంవత్సరాలలో ఓ ప్రత్యేక ఇన్నింగ్స్ ఆడలేదు. ఆ ఇన్నింగ్స్ ఇంగ్లండ్ జట్టుపై ఆడాడు. 240 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో స్కోర్ చేశాడంటే.. బంతిని ఎలా బాదాడో అర్ధం చేసుకోవచ్చు. అంతటి స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేయడం సాధారణ విషయం కాదు. జానీ బెయిర్‌స్టో క్యాచ్ వదిలేయడం కూడా అతడికి అదృష్టం కలిసొచ్చింది. అంతేకాదు ఆ బంతి సిక్స్ వెళ్లింది. అతను ఒక పెద్ద హిట్టర్ మాత్రమే కాదు బాగా బౌలింగ్ చేయగలడు. కేన్ విలియమ్సన్ జిమ్మీకి 20వ ఓవర్ ఇవ్వడం ద్వారా అతనిపై ఉన్న తన నమ్మకంను చూపించాడు. ఏదేమైనా నీషమ్ తన ప్రతిభకు న్యాయం చేశాడు' అని అన్నాడు.
'కివీస్ ఆటగాళ్లంతా వారి ప్రదర్శనపై చాలా నమ్మకంతో ఉన్నారు. చాలా చిన్న దేశం నుంచి వచ్చినా.. వారంతా సమష్టిగా రాణిస్తూ గొప్ప విజయాలను అందుకొన్నారు. ఆరంభంలోనే రెండు కీలక వికెట్లు కోల్పోయినా.. బ్యాటర్లు ఏమాత్రం నిరాశ చెందలేదు. నిలకడగా ఆడుతూ కెప్టెన్ నమ్మకాన్ని, ఆశలని నిలబెట్టారు. కెప్టెన్ కేన్ విలియమ్సన్ జట్టులోని ప్రతి ఆటగాడిని గౌరవిస్తాడు. వారిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా పరిస్థితులకు తగ్గట్టుగా మలుచుకుంటాడు. అందుకే న్యూజిలాండ్ ఇంకా ఒక ఓవర్ మిగిలి ఉండగానే అలవోకగా విజయం సాధించింది. కేన్ వంటి గొప్ప నాయకుడి చేతిలో జట్టు పగ్గాలుండటంతోనే ఇది సాధ్యమయింది. అందుకే ప్రస్తుత క్రికెటర్లలో విలియమ్సన్ ఓ లెజెండ్' అని సునీల్ గవాస్కర్ పేర్కొన్నాడు.