టీ20 ప్రపంచకప్‌లో భారత్ మహా సమరానికి సిద్ధమైంది. బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో శనివారం ఫైనల్‌లో తలపడనుంది. 11 ఏళ్ల నుంచి కలగా మిగిలిపోతున్న ఐసీసీ ట్రోఫీను దక్కించుకోవడానికి టీమిండియా మరో అడుగు దూరంలో మాత్రమే నిలిచింది. జట్టు నిండా మ్యాచ్ విన్నర్లు ఉన్న భారత్ టైటిల్ ఫేవరేటే. కానీ ప్రత్యర్థి సౌతాఫ్రికాను తక్కువగా అంచనా వేయలేని పరిస్థితి.
ఈ ప్రపంచకప్‌లో భారత్, దక్షిణాఫ్రికా రెండూ ఓటమెరుగని జట్లే. లీగ్, సూపర్-8 స్టేజ్‌ల్లో విజయాలతో హోరెత్తించి, సెమీఫైనల్స్‌ను సునాయాసంగా గెలిచి ఫైనల్‌కు దూసుకొచ్చాయి. మరోవైపు గత వన్డే వరల్డ్ కప్‌లోనూ టీమిండియా, సౌతాఫ్రికా గొప్ప పోరాటం చేశాయి. కానీ ఇరు జట్లు నాకౌట్ మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడి కప్ కలను చేజార్చుకున్నాయి. సెమీస్‌లో సౌతాఫ్రికా, తుదిపోరులో భారత్‌ను ఓడించి ఆసీస్ కప్ ఎగరేసుకుపోయింది.

ఆ పగిలిన గుండెతో ఇరు జట్లు కప్ లక్ష్యంగా టీ20 వరల్డ్ కప్‌లో అడుగుపెట్టారు. టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచారు. అయితే ప్రపంచకప్ చరిత్రలో తొలిసారి ఫైనల్‌కు అర్హత సాధించిన దక్షిణాఫ్రికా ఉత్సాహంతో ఉంది. ఆ జట్టు జోరుకు కళ్లెం వేసి కప్‌ను గెలవాలంటే భారత్ ప్రత్యేక ప్రణాళికలతో బరిలోకి దిగాలి. ఈ మెగాటోర్నీలో ప్రొటీస్‌కు బలమైన డెత్ బౌలింగ్ ఉంది. ఎన్నో ఓడే మ్యాచ్‌లను సంచలన బౌలింగ్‌తో లక్ష్యాన్ని కాపాడుకున్నారు.

అయితే ప్రత్యర్థి బౌలింగ్ కంటే ముగ్గురు ప్రధాన బ్యాటర్లు భారత్‌ను కలవరపెడుతున్నారు. క్వింటన్ డికాక్, హెన్రిచ్ క్లాసెన్, డేవిడ్ మిల్లర్ ప్రమాదకర ప్లేయర్లు. కాసేపు వాళ్లు క్రీజులో ఉన్న చేయాల్సిన నష్టాన్ని చేసే వెళ్తారు. కఠిన పిచ్‌పై కూడా డికాక్ జట్టుకు మెరుపు ఆరంభాన్ని ఇస్తున్నాడు. పవర్‌ప్లేలోనే భారీ స్కోరు సాధించి ప్రత్యర్థిని ఒత్తిడిలోని నెట్టేస్తున్నాడు. ఇక మిల్లర్, క్లాసెన్ అత్యుత్తమ ఫినిషర్లుగా కొనసాగుతున్నారు.

మిడిల్ ఓవర్లలో వచ్చి ఇన్నింగ్స్‌ను ఘనంగా ముగిస్తున్నారు. అందుకే ఫైనల్‌లో ఆ ముగ్గురిని త్వరగా పెవిలియన్‌కు చేర్చాలని టీమిండియా భావిస్తోంది. డికాక్ కోసం అక్షర్ పటేల్ ఉచ్చు బిగిస్తున్నాడు. క్లాసెన్ కోసం కుల్‌దీప్ కాచుకొని ఉన్నాడు. ఇక డేవిడ్ మిల్లర్‌పై హార్దిక్ పాండ్యకు మెరుగైన రికార్డు ఉంది. అయితే ప్రత్యర్థులను ఔట్ చేయడానికి అక్షర్, కుల్‌దీప్, హార్దిక్ తడబడినా బుమ్రా రంగంలోకి దిగనున్నాడు. కాగా, అనుభవజ్ఞులైన ఈ ముగ్గరును త్వరగా ఔట్ చేస్తే సౌతాఫ్రికాను ఓడించడం భారత్‌కు పెద్ద కష్టమేమికాదు.