దక్షిణాఫ్రికాను పసికూన నేపాల్ భయపెట్టింది. దాదాపు సంచలన విజయం నమోదు చేసేలా ఆఖరి బంతి వరకు పోరాడింది. కానీ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైంది. కింగ్స్‌టౌన్ వేదికగా నరాలు తేగే ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో అంతిమంగా నేపాల్‌పై దక్షిణాఫ్రికా విజయం సాధించింది. లీగ్ దశను సౌతాఫ్రికా అజేయంగా ముగించింది. గ్రూప్-డీలోని ప్రత్యర్థి జట్లన్నింటినీ ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నిర్ణీత 20 ఓవరల్లో ఏడు వికెట్లకు 115 పరుగులు చేసింది. ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (43; 49 బంతుల్లో, 5 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ట్రిస్టన్ స్టబ్స్ (27 నాటౌట్; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) దూకుడుగా ఆడాడు. కుశాల్ (4/19) నాలుగు, దీపేంద్ర సింగ్ (3/21) మూడు వికెట్లతో సత్తాచాటారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సౌతాఫ్రికా ఆదిలోనే వికెట్ కోల్పోయింది.

దీపేంద్ర బౌలింగ్‌లో డికాక్ (10; 11 బంతుల్లో, 1 ఫోర్) రిటర్న్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన మార్క్‌రమ్‌తో కలిసి హెండ్రిక్స్ ఇన్నింగ్స్ చక్కదిద్దాడు. కానీ మందకొడి పిచ్‌పై సౌతాఫ్రికా ఇన్నింగ్స్ నిదానంగా సాగింది. ఓ ఎండ్‌లో వికెట్లు పడుతుననా హెండ్రిక్స్ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. అయితే స్టబ్స్ క్రీజులోకి రావడంతో సఫారీల ఆటలో దూకుడు పెరిగింది. స్టబ్స్ ఎడాపెడా బౌండరీలతో ప్రత్యర్థి ముందు పోరాడే లక్ష్యాన్ని ఉంచాడు.
అనంతరం ఛేదనలో నేపాల్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఓపెనర్ ఆసిఫ్ షేక్ (42; 49 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్), అనిల్ సా (27; 24 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) పోరాడారు. షంసీ (4/19) నాలుగు వికెట్లతో సత్తాచాటాడు. ఛేజింగ్ ఆరంభంలోనే నేపాల్ రెండు వికెట్లు కోల్పోయింది. కానీ ఆసిఫ్-అనిల్ అర్ధశతకం భాగస్వామ్యంతో లక్ష్యాన్ని కరిగిస్తూ జట్టును విజయం దిశగా నడిపించారు. అయితే నేపాల్ విజయానికి 38 బంతుల్లో 31 పరుగుల అవసరమైన స్థితిలో అనిల్ వికెట్ ఔటవ్వడంతో మ్యాచ్ దక్షిణాఫ్రికా వైపు మళ్లింది.

ఆఖరి బంతికి రెండు పరుగులు...
షంసీ వికెట్ల వేటతో నేపాల్ విజయం సమీకరణం 4 ఓవర్లలో 21 పరుగుల నుంచి చివరి 2 ఓవర్లలో 16 పరుగులుగా మారింది. నోకియా వేసిన 19వ ఓవర్‌లో మొదటి నాలుగు బంతుల్లో నేపాల్ వికెట్ కోల్పోయి ఒక్క పరుగు కూడా చేయలేదు. కానీ అయిదో బంతిని సోంపాల్ సిక్సర్‌గా మలిచి, ఆరో బంతికి రెండు పరుగులు తీశాడు. దీంతో నేపాల్ గెలుపుకు చివరి ఆరు బంతుల్లో 8 పరుగులు అవసరమయ్యాయి. కాగా, బార్ట్‌మన్ వేసిన ఆఖరి ఓవర్ తొలి రెండు బంతులకు పరుగులేమి రాలేదు.
కానీ గుల్షాన్ వరుసగా ఫోర్, రెండు పరుగులు చేసి నేపాల్‌ను విజయానికి దగ్గరగా చేర్చాడు. కానీ బార్ట్‌మన్ అయిదో బంతిని డాట్ చేశాడు. దీంతో ఆఖరి బంతికి రెండు పరుగులు అవసరమయ్యాయి. అయితే చివరి బంతిని గుల్షాన్ బ్యాటుకు తాకించలేకపోయాడు. కానీ బై రూపంలో పరుగు తీయాలనుకున్న నేపాల్‌కు సౌతాఫ్రికా చెక్ పెట్టి ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది.