టీ20 వరల్డ్ కప్ గెలవడానికి భారత జట్టుకు వంద శాతం అర్హత ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ అన్నాడు. టీమిండియానే టైటిల్ గెలవాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు. ఉపఖండలోనే ప్రపంచకప్ ఉండాలని పేర్కొన్నాడు. అప్రతిహత విజయాలతో దూసుకెళ్తున్న భారత్ సెమీఫైనల్స్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే.
గయానా వేదికగా గురువారం ఇంగ్లండ్‌తో భారత్ సెమీఫైనల్ ఆడనుంది. సెమీస్ గండం దాటితే టీమిండియా టైటిల్ సాధించడం కష్టమేమి కాదు. మరో సెమీఫైనల్‌లో ఆడనున్న దక్షిణాఫ్రికా వర్సెస్ అఫ్గానిస్థాన్ మ్యాచ్ విజేతతో ఫైనల్ ఆడాల్సి ఉంటుంది. డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో పోలిస్తే సౌతాఫ్రికా, అఫ్గాన్‌ను ఎదుర్కోవడమే రోహిత్ సేనకు కాస్త ఉపశమనంగా ఉంటుంది.

కాగా, సూపర్-8 స్టేజ్‌లోనే ఆస్ట్రేలియాను భారత్ ఇంటికి పంపింది. వన్డే వరల్డ్ కప్ ఫైనల్ ఓటమికి బదులు తీర్చుకుంది. అయితే ఫైనల్ బాధను దిగమింగి మరో మెగాటోర్నీలో పొట్టి కప్ లక్ష్యంగా బరిలోకి దిగి, ఆస్ట్రేలియాను చిత్తుగా ఓడించిన టీమిండియాను షోయబ్ అక్తర్ కొనియాడాడు. ''ఆస్ట్రేలియాపై భారత్‌కు ఇది సమగ్ర విజయం. గెలవాల్సిన వన్డే వరల్డ్ కప్‌లో ఓటమి అనంతరం టీమిండియా నిరాశకు లోనైంది. ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై తీవ్ర నిరాశకు గురైంది. అయితే ఆ నిరాశ ప్రతీకారంగా మారింది. ఆస్ట్రేలియాను చిత్తుచేసేలా చేసింది''
''వెల్‌డన్ ఇండియా. ఇక టీ20 వరల్డ్ కప్ మీదే. మీరు ఈ ప్రపంచకప్‌ను తప్పక గెలవాలి. కప్ ఉపఖండంలోనే ఉండాలి. దీంతో పాటు గత వరల్డ్ కప్‌ను సాధించడానికి మీరు వంద శాతం అర్హులు. భారత్‌కే నా మద్దతు. రోహిత్ తీవ్రత ఎంతో బాగుంది. అతడి ఆలోచనలకు స్ఫష్టత ఉంది. అతను ట్రోఫీని అందుకోవడానికి అర్హుడు'' అని షోయబ్ అక్తర్ పేర్కొన్నాడు.

సూపర్-8 స్టేజ్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ 24 పరుగుల తేడాతో గెలిచిన సంగతి తెలిసిందే. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ అయిదు వికెట్లకు 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (92; 41 బంతుల్లో, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (76; 43 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడాడు.