టీ20 వరల్డ్ కప్‌లో పేలవ ప్రదర్శనతో తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం పట్టిన పాకిస్థాన్‌పై భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రంగా విమర్శించాడు. వర్షం కారణంగా సూపర్-8కు అర్హత సాధించలేదనే సాకులు చెప్పొద్దని మండిపడ్డాడు. వచ్చే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ తరఫున బరిలోకి దిగాలనుకుంటే బాబర్ అజామ్ ఆటతీరును మార్చుకోవాలని అన్నాడు. లీగ్ స్టేజ్‌లో నాలుగు మ్యాచ్‌లు ఆడిన పాక్ నాలుగు పాయింట్లతో గ్రూప్-ఏలో మూడో స్థానంలో నిలించింది.
అమెరికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో సూపర్ ఓవర్‌లో పాకిస్థాన్ ఓటమిపాలైంది. తర్వాత భారత్ చేతిలో పరాజయాన్ని చవిచూసింది. అనంతరం కెనడాపై విజయం సాధించి అదృష్టం కోసం ఎదురుచూసింది. అమెరికాపై ఐర్లాండ్ విజయం సాధించాలని, ఆ తర్వాత ఐర్లాండ్‌ను ఓడించి తదుపరి దశకు చేరాలని ఆశించింది. కానీ వర్షం కారణంగా అమెరికా-ఐర్లాండ్ మ్యాచ్ రద్దైంది. దీంతో యూఎస్‌ఏ అయిదు పాయింట్లతో సూపర్-8కు క్వాలిఫై అయ్యింది. పాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.

''వర్షాన్ని ఎలా నిందిస్తారు? గెలిచినప్పటికీ తదుపరి దశకు వెళ్లే అర్హత పాకిస్థాన్‌కు లేదు. సూపర్-8 స్టేజ్‌లో పరాజయాలు చవిచూస్తారు. అక్కడ సులువైన ప్రత్యర్థి జట్లు లేవు. తొలిసారి ప్రపంచకప్ ఆడుతున్న అమెరికా చేతిలో ఓటమిపాలయ్యారని గుర్తుంచుకోండి. మెగాటోర్నీలో ముందుకు వెళ్లడానికి మీకు అర్హత లేదు. భారత్‌పై 120 పరుగుల లక్ష్యాన్ని కూడా ఛేదించలేకపోయారు. 113 పరుగులే చేసి చేతిలో వికెట్లు కూడా ఉంచుకున్నారు. ఇలాంటి ప్రదర్శనతో వర్షాన్ని నిందిస్తారా?''
''పాకిస్థాన్‌కు వెళ్లిన తర్వాత బాబార్ అజామ్ సేన తమ ప్రదర్శన గురించి సమీక్షించుకోవాలి. పొట్టి ఫార్మాట్‌లో ముందుకు వెళ్లడానికి ఏం చేయాలో ఆలోచించాలి. ప్రస్తుత పాకిస్థాన జట్టు ఫామ్‌ను చూస్తే.. మంచి వికెట్‌పై ప్రత్యర్థిపై పైచేయి సాధించలేదు. ఇక బాబర్ అజామ్ వచ్చే వరల్డ్ కప్‌లో ఆడాలంటే తన ఆటను మెరుగుపర్చుకోవాలి. టీ20 ఫార్మాట్‌కు సరిపోని బ్యాటర్లు బాబర్‌తో పాటు మరికొంతముంది జట్టులో ఉన్నారు'' అని సెహ్వాగ్ అన్నాడు.
2007 తొలి టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ రన్నరప్‌గా నిలిచింది. ఆ తర్వాత 2009లో ఏకంగా ఛాంపియన్‌గా అవతరించింది. 2010, 2012, 2021లో సెమీఫైనల్స్ వరకు వచ్చింది. 2014, 2016 ప్రపంచకప్‌ల్లో సూపర్ 10కు అర్హత సాధించింది. గత 2022 పొట్టి కప్‌లో ట్రోఫీని తృటిలో చేజార్చుకుని మరోసారి రన్నరప్‌గా టోర్నీని ముగించింది. గత మెరుగైన రికార్డులతో పాకిస్థాన్ ఈసారి భారీ అంచనాలతో బరిలోకి దిగింది. కానీ తొలి రౌండ్‌లోనే ఔటైంది.