
ముంబై: ఈ ఏడాది అక్టోబర్-నవంబర్ నెలల్లో భారత్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను యూఏఈకి మార్చే అవకాశాలున్నాయని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కార్యదర్శి జై షా ప్రకటించారు. జే షా ఇవాళ మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం భారత్‌లో ఉన్న కరోనా పరిస్థితులను సమీక్షిస్తున్నామని.. టోర్నీలో పాల్గొనే ప్లేయర్ల ఆరోగ్యం, రక్షణ కీలకమైందన్నారు. టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించాలా లేదా అన్న అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని షా వెల్లడించారు. వేదిక మార్పుపై త్వరలోనే అధికారిక ప్రకటన చేస్తామని షా చెప్పారు.
'కరోనా వైరస్ పరిస్థితి కారణంగా భారత్‌లో జరగాల్సి టీ20 ప్రపంచకప్ 2021 టోర్నమెంట్‌ను యూఏఈకి మార్చే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం భారత్‌లో ఉన్న పరిస్థితులను సమీక్షిస్తున్నాం. టోర్నీలో పాల్గొనే ప్లేయర్ల ఆరోగ్యం, రక్షణ మాకు చాలా ముఖ్యం. టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించాలా లేదా అన్న అంశంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం' అని బీసీసీఐ కార్యదర్శి జై షా వెల్లడించారు. ఐపీఎల్ 2021 సైతం కరోనా కేసుల కారణంగానే వాయిదా పడింది. ఆ మెగా టోర్నీని కూడా యూఏఈలోనే నిర్వహించాలని బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తోంది.
సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 మధ్య ఐపీఎల్ 2021 నిర్వహించాలని బీసీసీఐ చూస్తోంది. ఇక టీ20 ప్రపంచకప్ యూఏఈ వేదికగా అక్టోబర్ 17న ప్రారంభం కానుంది. పొట్టి కప్ ఫైనల్ నవంబర్ 14న జరగనుందట. దాదాపు 28 రోజుల పాటు టీ20 ప్రపంచకప్ అభిమానులను అలరించనుంది. మొత్తం 16 దేశాలు పాల్గొనే ఈ టోర్నీలోని మ్యాచులు అబుదాబి, షార్జా, దుబాయ్ వేదికగా జరగనున్నాయి. ఒమన్ రాజధాని మస్కట్‌ను కూడా నాలుగో వేదికగా పరిగణలోకి తీసుకున్నారట. మొదటి వారం మ్యాచులు ఒమన్‌లో నిర్వహిస్తారని సమాచారం తెలుస్తోంది.
టీ20 ప్రపంచకప్‌ను భారత్‌లో నిర్వహించాలని బీసీసీఐ అనుకున్నా.. రెండు ప్రధాన ప్రధానాంశాలు బోర్డుకు ప్రతికూలంగా మారుతున్నాయి. ఈ మెగా టోర్నీకి భారత ప్రభుత్వం నుంచి పన్ను మినహాయింపు లభించకపోవడం మొదటిది. కరోనా కారణంగా ఐపీఎల్ 2021 వాయిదా పడిన నేపథ్యంలో 16 దేశాలకు చెందిన ఆటగాళ్లు భారత్‌కు వస్తారా? అన్నది రెండోది. యూఏఈలో టోర్నీ జరిగితే బీసీసీఐకి 41 శాతం ఆర్థిక లాభం చేకూరనుంది. ఒకవేళ భారత్‌లో ఈ టోర్నీ జరిపితే ప్రభుత్వానికి భారీగా పన్ను కట్టాల్సి వచ్చేది. 2016లో జరిగిన టీ20 ప్రపంచకప్‌నకు సంబంధించిన పన్ను మినహాయింపు ఇప్పటివరకు లభించకపోవడం గమనార్హం.