
సిడ్నీ: ఈ ఏడాది అక్టోబరులో టీ20 ప్రపంచకప్ నిర్వహిస్తే ఆస్ట్రేలియాకే అత్యంత ప్రమాదకరం అని క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) సీఈవో కెవిన్ రోబర్ట్స్ అభిప్రాయపడ్డారు. 16 క్రికెట్ జట్లని ఆస్ట్రేలియాలోకి అనుమతించడం చాలా రిస్క్‌తో కూడుకున్నదన్నారు. ఆటగాళ్ల రక్షణ, హోటల్, ప్రయాణం లాంటివి ఏర్పాటు చాలా కష్టం రోబర్ట్స్ పేర్కొన్నాడు. షెడ్యూల్ ప్రకారం అక్టోబరు 18 నుంచి నవంబరు 15 వరకూ టీ20 ప్రపంచకప్ జరగాల్సి ఉంది.
ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా టీ20 ప్రపంచకప్ జరుగుతుందా లేదా అన్న ఉత్కంఠకు మరో 15 రోజుల్లో తెరపడే అవకాశం ఉంది. కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కారణంగా ఈ మెగా టోర్నీని అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ).. 2022కు వాయిదా వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అన్ని దేశాల బోర్డు సభ్యులతో పొట్టి ప్రపంచకప్ నిర్వహణ అంశంపై ఐసీసీ మరోసారి (జూన్ 10 తర్వాత) చర్చించనుంది. ఆ తర్వాత తుది నిర్ణయం తీసుకోనున్నారు. అయితే వాయిదా వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. అందుకు కారణం ఈ ఏడాది ఆతిథ్యమిచ్చేందుకు ఆస్ట్రేలియా వెనక్కి తగ్గడమే.

'అక్టోబరు-నవంబరు నాటికి కరోనా పరిస్థితులు అదుపులోకి వస్తాయని అప్పట్లో ఆశించాం. కానీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కఠిన పరిస్థితుల నేపథ్యంలో 16 క్రికెట్ జట్లని ఆస్ట్రేలియాలోకి అనుమతించడం చాలా రిస్క్. ఒక్కరికి వైరస్ ఉన్నా.. అందరిపై ప్రభావం చూపుతుంది. ఇలాంటి పరిస్థితిలో ఆటగాళ్ల రక్షణ, హోటల్, ప్రయాణం లాంటివి ఏర్పాటు చాలా కష్టం. దీంతో టీ20 ప్రపంచకప్‌ను షెడ్యూల్ ప్రకారం నిర్వహించలేం. వచ్చే ఏడాది ఫిబ్రవరి-మార్చి లేదా అక్టోబరు-నవంబరు నెలల్లో టోర్నీని నిర్వహించేందుకు ఉన్న అవకాశాల్ని పరిశీలిస్తాం' అని రోబర్ట్స్ చెప్పాడు.
వైరస్ కారణంగా దాదాపు మూడు నెలలుగా క్రీడాలోకం నిలిపోయింది. కరోనా దెబ్బకు అన్ని దేశాలు లాక్‌డౌన్ విధించాయి. ఈ క్రమంలో ఏప్రిల్ 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ 2020 నిరవధిక వాయిదా పడింది. ఒకవేళ టీ20 ప్రపంచకప్ వాయిదా పడితే.. అక్టోబర్ నెలలో ఐపీఎల్ 2020 నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధంగా ఉన్నట్లు ఇప్పటికే పలు వార్తలు చక్కర్లు కొట్టాయి. బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీ కూడా అన్ని దేశాల బోర్డు సభ్యులతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.
ఇతర దేశాలతో పోలిస్తే.. ఆస్ట్రేలియాలో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసుల సంఖ్య చాలా తక్కువ. ఇప్పటి వరకూ ఆస్ట్రేలియాలో 7,165 మంది కరోనా వైరస్ బారిన పడగా.. 6,580 మంది కోలుకున్నారు.103 మంది మాత్రమే చనిపోయారు. మరోవైపు భారత్‌లో ఇప్పటికే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 1,65,799కి చేరుకోగా.. 71,206 మంది కోలుకున్నారు. దాదాపు 4,711 మంది చనిపోయారు. మార్చి నెలలోనే అప్రమత్తమైన ఆస్ట్రేలియా ప్రభుత్వం సెప్టెంబర్ వరకూ పర్యాటక వీసాల్ని రద్దు చేసిన విషయం తెలిసిందే.