మరో నెల రోజుల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానుంది. ఈ మెగా టోర్నీలో పాల్గొనే భారత జట్టును బీసీసీఐ మంగళవారం ప్రకటించింది. రోహిత్ శర్మ సారథ్యంలో 15 మందితో కూడిన జట్టును వెల్లడించింది. రింకూ సింగ్, కేఎల్ రాహుల్‌కు మొండిచేయి చూపడం మినహా అంచనాలకు తగ్గట్లుగానే జట్టును ఎంపిక చేసింది.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి, యశస్వీ జైస్వాల్, సూర్య కుమార్ యాదవ్ టాప్ ఆర్డర్ బ్యాటర్లుగా ఎంపిక అయ్యారు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో గాయపడిన రిషభ్ పంత్ మెగాటోర్నీతో అంతర్జాతీయ క్రికెట్‌లో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. పంత్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, సంజు శాంసన్ మిడిలార్డర్‌లో చోటు దక్కించుకున్నారు.

స్పిన్ ఆల్‌రౌండర్లుగా అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా సెలక్ట్ అయ్యారు. బుమ్రాతో పాటు అర్షదీప్ సింగ్, మహ్మద్ సిరాజ్ పేస్, కుల్‌దీప్ యాదవ్, చాహల్ స్పిన్ బాధ్యతలు మోయనున్నాడు. అయితే ప్రపంచకప్‌కు ఎంపికైన ఈ భారత జట్టుపై కోలివుడ్ స్టార్ హీరో శరత్ కుమార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. టీమిండియాలో తమిళ పేర్లు లేకపోవడం నిరుత్సాహం కలిగించిందని అన్నారు. ఫాస్ట్ బౌలర్ నటరాజన్‌ను ఎంపిక చేయాలని కోరారు.
''భారత్, టీమిండియా అంటే ఎప్పుడూ ఇష్టమే. కానీ జట్టులో తమిళ పేర్లు లేకపోవడం నిరుత్సాహం కలిగించింది. వ్యక్తిగతంగా నటరాజన్ బౌలింగ్ నాకు చాలా ఇష్టం. డెత్‌ఓవర్లలో అతను అద్భుతమైన యార్కర్లు వేస్తాడు. అలాంటి నటరాజన్ తిరిగి జట్టులోకి తీసుకునేందుకు సెలక్టర్లు పునరాలోచించాలి'' అని శరత్ ట్వీట్ చేశారు.
దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కూడా డెత్ ఓవర్ స్పెషలిస్ట్ నటరాజన్ ఎంపికవ్వాల్సిందని అభిప్రాయపడ్డాడు. అర్షదీప్ సింగ్, సిరాజ్ ఫామ్‌లో లేకపోవడం అభిమానులను ఆందోళనకు గురిచేస్తోంది. అయితే భారత జట్టులో తమిళ పేర్లు ఉండాలని సీనియర్ హీరో శరత్ ప్రాంతీయ అభిమానాన్ని వ్యక్తం చేయడమే చర్చనీయాంశంగా మారింది.
టీ20 వరల్డ్ కప్‌కు ఎంపిక చేసిన టీమిండియా:
రోహిత్ శర్మ (కెప్టెన్), హార్దిక్ పాండ్య (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, విరాట్ కోహ్లి, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్) సంజు శాంసన్ (వికెట్ కీపర్), శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్‌దీప్ యాదవ్, యుజువేంద్ర చాహల్, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్
రిజర్వ్ ప్లేయర్లు: శుబ్‌మన్ గిల్, రింకూ సింగ్, ఖలీల్ అహ్మద్, అవేష్ ఖాన్.