నవంబర్ 19, 2023.. ఈ తేదినీ భారత క్రికెట్ అభిమానులు అంత ఈజీగా మరిచిపోలేరు. వన్డే వరల్డ్ కప్‌లో ఆద్యంతం సత్తాచాటిన భారత్ ఫైనల్‌లో తడబడింది ఆ రోజే. ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలై కప్‌ను చేజార్చుకుంది. ఆ మ్యాచ్‌లో రోహిత్ శర్మ లేదా విరాట్ కోహ్లి ఔట్ కాకుండా ఉంటే పరిస్థితి ఇంకోలా ఉండేదని అభిమానులు ఓటమి అనంతనం అనుకున్నారు. అది ఎంత వరకు నిజమో హిట్‌మ్యాన్ టీ20 వరల్డ్ కప్‌లో నిరూపించాడు.
సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ విధ్వంసం సృష్టించాడు. ఆస్ట్రేలియాపై ప్రతీకారం తీర్చుకోవాలని పగతో రగిలిపోతూ ఆడినట్లుగా అతడి ఇన్నింగ్స్ కొనసాగించింది. చేతిలో ఉంది బ్యాటేనా లేదా మంత్రదండంమా అనే సందేహం వచ్చేలా బౌండరీలు, సిక్సర్లుతో హోరెత్తించాడు. రోహిత్‌తో పాటు ఆటగాళ్లంతా సమష్టిగా సత్తాచాటడంతో ఆస్ట్రేలియాపై టీమిండియా 24 పరుగుల తేడాతో విజయం సాధించింది.

మొదట బ్యాటింగ్ చేసిన భారత్ అయిదు వికెట్లకు 205 పరుగులు చేసింది. రోహిత్ శర్మ (92; 41 బంతుల్లో, 7 ఫోర్లు, 8 సిక్సర్లు) సంచలన ప్రదర్శన చేశాడు. సూర్య (31; 16 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా ఏడు వికెట్లు కోల్పోయి 181 పరుగులు చేసింది. ట్రావిస్ హెడ్ (76; 43 బంతుల్లో, 9 ఫోర్లు, 4 సిక్సర్లు) పోరాడాడు. అర్షదీప్ (3/37), కుల్‌దీప్ (2/24) వికెట్లతో సత్తాచాటాడు.
ఈ క్రమంలో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న రోహిత్ శర్మ అరుదైన రికార్డులు బ్రేక్ చేశాడు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో ఈ అవార్డు అందుకున్న తొలి భారత కెప్టెన్‌గా నిలిచాడు. టీ20 ప్రపంచకప్‌లో ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ప్లేయర్‌గా యువరాజ్ సింగ్ (7) పేరిట ఉన్న రికార్డును హిట్ మ్యాన్ బద్దలుకొట్టాడు. ఈ మ్యాచ్‌లో రోహిత్ 8 సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఇక అంతర్జాతీయ టీ20ల్లో 200 సిక్సర్ల మార్క్‌ను అందుకున్న ఏకైక ఆటగాడిగా రోహిత్ చరిత్రకెక్కాడు.
అంతేగాక ఇంటర్నేషనల్ టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన ప్లేయర్‌గా రికార్డు నెలకొల్పాడు. 4165 పరుగులు చేసిన రోహిత్.. బాబర్ అజామ్ 4145 రన్స్ రికార్డును బ్రేక్ చేశాడు. ఈ ప్రపంచకప్‌లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ (19) సాధించిన ప్లేయర్‌గా నిలిచాడు. అలాగే పవర్‌ప్లేలోనే 50 పరుగులు అందుకున్న తొలి ఆటగాడిగా ఘనత అందుకున్నాడు.