టీ20 వరల్డ్ కప్‌లో సంచలన ప్రదర్శనకు కేరాఫ్ అడ్రస్‌గా అఫ్గానిస్థాన్ నిలుస్తుంది. గ్రూప్ దశలో న్యూజిలాండ్‌ను ఓడించిన అఫ్గాన్ ఆదివారం ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. సెమీఫైనల్ రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ షోతో అఫ్గానిస్థాన్ అదరగొట్టింది. 21 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అన్ని ఫార్మాట్లలో ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్‌కు ఇదే తొలి విజయం.
మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (60; 49 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (51; 48 బంతుల్లో, 6 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు. వీరిద్దరు తొలి వికెట్‌కు 11.5 ఓవర్లలో 118 పరుగులు జోడించారు. ప్యాట్ కమిన్స్ (3/28) హ్యాట్రిక్ వికెట్లు సాధించాడు. ఆడమ్ జంపా (2/28) రెండు వికెట్లు తీశాడు.

అనంతరం ఛేదనకు దిగిన ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. గుల్బాదిన్ నైబ్ (4/20) నాలుగు, నవీనుల్ హక్ (3/20) మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు. గత వన్డే వరల్డ్ కప్‌లో అఫ్గాన్ చేతిలో జట్టు ఓటమిని తప్పించిన గ్లెన్ మాక్స్‌వెల్ (59; 41 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) ఈ సారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయలేకపోయాడు. మాక్సీ పోరాటం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
అయితే ఈ మ్యాచ్‌కు కామెంటరీగా వ్యవహరించిన ఆస్ట్రేలియా దిగ్గజ ప్లేయర్ రికీ పాంటింగ్ తమ జట్టు ఓటమిని చూసి తట్టుకోలేకపోయాడు. కామెంటరీ బాక్స్‌లో కన్నీటినూ ఆపుకుంటూ తన బాధ్యతలు నిర్వర్తించాడు. మరో వ్యాఖ్యాత, న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ ఇయాన్ స్మిత్ అఫ్గానిస్థాన్ విన్నింగ్ మూమెంట్‌ను గొప్పగా వర్ణించాడు. చారిత్రక విజయాన్ని అందుకున్న అఫ్గానిస్థాన్‌ను కొనియాడుతూ ఆటగాళ్లను సంబరాల గురించి తనశైలిలో కామెంటరీ చేశాడు.
అదే సమయంలో పక్కన ఉన్న ఆసీస్ మాజీ ఆటగాళ్లు పాంటింగ్, మాథ్యూ హెడెన్ బాధగా కూర్చున్నారు. హెడెన్ ఓటమి షాక్‌లో ఉండిపోయాడు. కన్నీటిని ఆపుకుంటూ పాంటింగ్ గొంతును సరిచేసుకున్నాడు. ఆ తర్వాత పాంటింగ్ మైక్‌ను అందుకుని మాట్లాడాడు. దీనికి సంబంధించిన వీడియోను ఐసీసీ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది.