ఐసీసీ చేసిన పనికి భారత అభిమానుల్లో హై టెన్షన్ మొదలైంది. కప్‌పై ధీమాగా ఉన్న ఫ్యాన్స్ అంతా ఆ విషయం తెలియడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడుతున్నారు. అసలేం జరిగిదంటే... టీ20 వరల్డ్ కప్‌లో ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. బార్బడోస్ వేదికగా టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. సౌతాఫ్రికా స్ట్రాంగ్ టీమ్ అయినప్పటికీ రోహిత్ సేననే తుదిపోరులో ఫేవరేటుగా బరిలోకి దిగుతోంది.
కెప్టెన్ రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య సూపర్ ఫామ్‌లో ఉండటం, బుమ్రా, కుల్‌దీప్ మంచి లయలో ఉండటంతో.. 13 ఏళ్ల ప్రపంచకప్ కప్ కల ఇవాళ నెరవేరినట్లేనని భారత అభిమానులంతా ఉత్సాహంగా ఉన్నారు. అయితే ఫైనల్ మ్యాచ్‌కు విధులు నిర్వహించే అంపైర్లు ఎవరో తెలియడంతో ఫ్యాన్స్ అంతా ఢీలా పడ్డారు. టైటిల్ చేజారుతుందేమోననే టెన్షన్ పడుతున్నారు. దానికి కారణం అంపైర్ రిచర్డ్ కెటిల్‌బరో.

ఇంగ్లండ్‌కు చెందిన రిచర్డ్ కెటిల్‌బరో భారత్ ఆడే నాకౌట్ మ్యాచ్‌లకు అంపైర్ విధులు నిర్వహిస్తే ఆ మ్యాచ్ చేజారినట్లే. రిచర్డ్ అడుగుపెట్టిన ఒక్క నాకౌట్ మ్యాచ్ కూడా భారత్ గెలిచినట్లుగా రికార్డే లేదు. టీమిండియాకు అతను ఐరన్ లెగ్ మ్యాన్‌గా మారాడు. అతడు ఉంటే భారత జట్టుకు దరిద్రమే అనేలా ఇప్పటివరకు ఫలితాలు వచ్చాయి. 2014 నుంచి ఇదే రిపీట్ అవుతోంది. 2014 టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో రిచర్డే అంపైర్. ఆ ఫైనల్‌లో శ్రీలంక చేతిలో ఓడి భారత్ కప్‌ను చేజార్చుకుంది.
2015 వన్డే ప్రపంచకప్ సెమీస్‌లోనూ రిచర్డ్ వచ్చాడు. ఆస్ట్రేలియాతో జరిగిన ఈ మ్యాచ్‌లోనూ భారత్ ఓడింది. 2016 టీ20 వరల్డ్ కప్ సెమీస్‌లో మళ్లీ రిచర్డ్ ఎంట్రీ ఇచ్చాడు. ఈ మ్యాచ్‌లోనూ వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓటమిపాలైంది. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్, 2019 వరల్డ్ కప్ సెమీ ఫైనల్, 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్, 2023 వన్డే వరల్డ్ కప్ ఫైనల్‌లో.. ఇలా భారత్ ఓడిన అన్ని మ్యాచ్‌ల్లో రిచర్డ్ కెటిల్‌బరోనే అంపైర్‌గా ఉన్నాడు.
అందుకే రిచర్డ్ కెటిల్‌బరో భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా ఫైనల్‌కు వస్తున్నాడంటే టీమిండియా అభిమానులు టెన్షన్ పడుతున్నారు. అయితే రిచర్డ్ ఈసారి టీవీ అంపైర్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. మరి, రిచర్డ్ సెంటిమెంట్ ఈ ఫైనల్‌లోనూ కొనసాగుతుందా? లేదా భారత్ గెలిచి రిచర్డ్ తన ఐరన్ లెగ్ మ్యాన్ పేరున పోగొట్టుకుండా అనే తెలియాలంటే మరికొన్ని గంటలు ఎదురుచూడాల్సిందే!