టీ20 వరల్డ్ కప్-2024లో సంచలన ప్రదర్శనలతో సెమీఫైనల్స్‌కు దూసుకొచ్చిన అఫ్గానిస్థాన్ కథ ముగిసింది. ట్రిండాడ్ వేదికగా గురువారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో అఫ్గాన్ తొమ్మిది వికెట్ల తేడాతో ఘోరపరాజయాన్ని చవిచూసింది. న్యూజిలాండ్, ఆస్ట్రేలియాపై అదిరే విజయాలు అందుకున్న అఫ్గానిస్థాన్ కీలక మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై పోరాట పటిమ చూపలేక తలవంచింది.
మండకొడి పిచ్‌పై మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ 11.5 ఓవర్లలో 56 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బౌలర్ల ధాటికి అఫ్గాన్ బ్యాటర్లు వణికిపోయారు. వరల్డ్ కప్ సెమీఫైనల్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసిన జట్టుగా అఫ్గాన్ అపకీర్తి మూటగట్టుకుంది. అజ్మతుల్లా ఒమర్జాయ్ (10; 12 బంతుల్లో, 2 ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరును అందుకున్నాడు. అఫ్గాన్ ఇన్నింగ్స్‌లో ఎక్స్‌ట్రా రూపంలో వచ్చిన 13 పరుగులే అత్యధిక స్కోరు కావడం గమనార్హం.

సౌతాఫ్రికా బౌలర్లలో మార్కో జేన్సన్ (3/16), షంసీ (3/6) చెరో మూడు వికెట్లతో విజృంభించారు. రబాడ (2/14), నోకియా (2/7) తలో రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలో ఒక్క వికెట్ కోల్పోయి విజయం సాధించింది. ఆదిలోనే డికాక్ (5; 8 బంతుల్లో, 1 ఫోర్) ఔటైనా రీజా హెండ్రిక్స్ (29 నాటౌట్; 25 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), మార్క్‌రమ్ (23 నాటౌట్; 21 బంతుల్లో, 4 ఫోర్లు) జట్టును విజయతీరాలకు చేర్చారు. డికాక్‌ను ఫజుల్లా ఫరూకీ బౌట్ చేశాడు.
కాగా, మ్యాచ్ అనంతరం తమ ఓటమికి గల కారణాలను అఫ్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ వివరించాడు. బ్యాటింగ్ వైఫల్యమే సెమీస్ ఓటమికి ప్రధాన కారణమని తెలిపాడు. అయితే ఈ మెగాటోర్నీలో ఎన్నో సానుకూలతలు ఉన్నాయని రషీద్ పేర్కొన్నాడు. బౌలింగ్‌లో నిలకడగా సత్తాచాటామని అన్నాడు. ఏ జట్టునైనా ఓడించగలమనే ఆత్మవిశ్వాసాన్ని పొందామని చెప్పాడు. వచ్చే మెగాటోర్నీలో మరిత మెరుగ్గా తిరిగొస్తామని వెల్లడించాడు.

''జట్టుగా ఇది కఠినమైన రోజు. ఈ ప్రదర్శన కంటే మేం మెరుగ్గా ఆడగలం. కానీ పరిస్థితులు మాకు అనుకూలించలేదు. అయితే ఎలాంటి పరిస్థితులకైనా సిద్ధంగా ఉండాలి. మేం పేలవంగా బ్యాటింగ్ చేశాం. దురదృష్టవశాత్తు ముజీబ్‌కు గాయమైంది. కానీ నబీ, ఫజల్ మా స్పిన్ యూనిట్ పనిని సులభం చేశారు. ఈ టోర్నీలో బౌలింగ్‌లో నిలకడైన ప్రదర్శనతో సత్తాచాటాం''
''ఈ ప్రపంచకప్‌ను ఆస్వాదించాం. దక్షిణాఫ్రికాతో సెమీఫైనల్ ఆడేవరకు వచ్చామని, బలమైన ప్రత్యర్థి చేతిలో ఓడామని అంగీకరిస్తాం. ఇది మాకు ఆరంభం మాత్రమే. ఏ జట్టును అయినా ఓడించగలమనే ఆత్మవిశ్వాసం ఉంది. కఠిన ప్రత్యర్థులతో ఒత్తిడి పరిస్థితులను మెరుగ్గా ఎదుర్కోవడమే కీలకం. కొన్ని విషయాలపై దృష్టిసారించాల్సి ఉంది. మిడిలార్డర్ బ్యాటింగ్‌పై ఫోకస్ చేయాలి. దూకుడుగా ఇన్నింగ్స్ ఆఖరివరకు కొనసాగేలా చూడాలి. ఈ టోర్నీలో కొన్ని మంచి ఫలితాల్ని సాధించాం. ఇక వచ్చే టోర్నీలో మెరుగ్గా, ముఖ్యంగా బ్యాటింగ్‌లో బలోపేతంగా రావాలి'' అని రషీద్ ఖాన్ అన్నాడు.