సెమీఫైనల్స్ అవకాశాలను మెరుగుపర్చుకోవడం కోసం భారత్ మరో సమరానికి సిద్ధమైంది. ఆంటిగ్వా వేదికగా ఇవాళ బంగ్లాదేశ్‌తో తలపడనుంది. అఫ్గానిస్థాన్‌పై ఘన విజయం సాధించి జోరు మీదున్న టీమిండియా బంగ్లాను మట్టికరిపిస్తే సెమీస్ బెర్తుకు మరింత చేరువైనట్లే. ప్రస్తుతం రోహిత్ సేన గ్రూప్-1లో రెండు పాయింట్లు, +2.350 నెట్‌రన్‌రేటుతో రెండో స్థానంలో ఉంది.
ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే భారత్ నెట్ రన్ రేటు మరింత పెరగడంతో పాటు ఖాతాలో నాలుగు పాయింట్లు అవుతాయి. దీంతో ఒకవేళ సూపర్-8లోని ఆఖరి మ్యాచ్‌లో భారత్ ఆస్ట్రేలియా చేతిలో ఓటమిపాలైనా సెమీస్ అవకాశాలపై ప్రభావం తక్కువగా చూపే ఛాన్స్ ఉంటుంది. అయితే భారత్ ప్రణాళికలను భగ్నం చేయడానికి వరుణుడు ఎంట్రీ ఇస్తున్నాడు. బంగ్లాదేశ్‌తో పోరులో ఇవాళ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి.

స్థానిక వాతావరణ శాఖ ప్రకారం మ్యాచ్ సమయంలో ఉరములతో కూడిన వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. భారత కాలమాన ప్రకారం ఇవాళ రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. అయితే రాత్రి 7.30 గంటల నుంచి రాత్రి 9 గంటల మధ్యలో వరుణుడు తన ప్రతాపం చూపించే అవకాశం ఉంది. ఆ తర్వాత వర్షం తగ్గముఖం పట్టినప్పటికీ ఔట్ ఫీల్డ్ తడిగా ఉంటే మ్యాచ్ రద్దు చేసే అవకాశాలు ఉంటాయి.
అయితే మ్యాచ్‌ను నిర్వహించడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. మైదానాన్ని సిద్ధం చేయడానికి ఆలస్యమైతే కనీసం అయిదు ఓవర్ల పాటు మ్యాచ్‌ను నిర్వహిస్తారు. అప్పటికీ సాధ్యం కాకపోతే రద్దు చేస్తూ ఇరు జట్లకు చెరో పాయింట్ ఇస్తారు. అలా జరిగితే భారత్‌కు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. బంగ్లాదేశ్‌పై రికార్డులు, బలబలాల పరంగా టీమిండియాదే పైచేయి. ఇవాళ సునాయాసంగా రోహిత్ సేన రెండు పాయింట్లు సాధించగలదు.
కానీ వర్షం కారణంగా ఒక్క పాయింట్ కోల్పోతే అది సెమీస్ క్వాలిఫై రేసులో ప్రభావం చూపే అవకాశాలు ఉంటాయి. అఫ్గానిస్థాన్ తమ మిగిలిన రెండు మ్యాచ్‌ల్లో గెలిస్తే.. టీమిండియా సెమీస్ చేరాలంటే ఆస్ట్రేలియాపై తప్పక విజయం సాధించాలి. దీంతో భారత్ ఆఖరి సూపర్-8 మ్యాచ్ డూ ఆర్ డైగా మారుతుంది.