టీ20 వరల్డ్ కప్‌లో భారత్ మహా సమరానికి సిద్ధమైంది. సెమీఫైనల్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో తలపడనుంది. గయానా వేదికగా గురువారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. టోర్నీలో ఓటమెరుగుని భారత్ ఇంగ్లండపై కూడా విజయఢంకా మోగించి ఫైనల్‌కు దూసుకెళ్లాలని పట్టుదలతో బరిలోకి దిగుతోంది.
ఇంగ్లండ్‌తో ఎదురయ్యే సెమీస్ గండం దాటితే భారత్‌కు కప్‌ను అందుకోవడం అంత కష్టతరమేమి కాదు. ఎందుకంటే బలమైన ఇంగ్లిష్ జట్టుతో పోలిస్తే దక్షిణాఫ్రికా-అఫ్గానిస్థాన్ మ్యాచ్ విజేతను ఎదుర్కోవడం టీమిండియాకు కాస్త సులువే. అయితే రోహిత్ సేన ఫామ్‌ను చూస్తే ఇంగ్లండ్‌ను ఓడించడం పెద్ద కష్టమేమికాదు.

రోహిత్ శర్మ ఫామ్‌లోకి రావడం టీమిండియాకు కలిసొస్తుంది. సూర్యకుమార్, పంత్, దూబె కీలక పరుగులు చేయడం, హార్దిక్ పాండ్య ఫినిషర్ పాత్రను సమర్థవంతంగా పోషించడం సానుకూలాంశాలు. ఇక విరాట్ కోహ్లి కూడా లయను అందుకుంటే బ్యాటింగ్ పరంగా భారత్‌కు తిరుగుండదు. బౌలింగ్ విషయానికొస్తే.. ప్రపంచకప్‌లో జట్టు విజయాల్లో ప్రధాన పాత్ర పోషించింది బౌలర్లే. బుమ్రా, అర్షదీప్, కుల్‌దీప్‌ను ఎదుర్కోలేక ప్రత్యర్థి బ్యాటర్లు విలవిలలాడుతున్నారు.
అయితే భారత్ అసలు చెమటోడ్చకుండానే ఫైనల్‌కు చేరే అవకాశం కూడా ఉంది. వర్షం కారణంగా సెమీఫైనల్ రద్దయితే టీమిండియా టైటిల్ పోరుకు దూసుకెళ్తుంది. ఎలా అంటే.. భారత్-ఇంగ్లండ్ సెమీస్‌కు రిజర్వ్ డే లేదు. కానీ అదనంగా 250 నిమిషాల సమయం కేటాయించారు. ఆ సమయంలోపు కూడా వరుణుడు/తడి అవుట్‌ఫీల్డ్ కారణంగా మ్యాచ్‌ను కొనసాగించలేని పరిస్థితి ఏర్పడితే మ్యాచ్‌ను రద్దు చేస్తారు.
లీగ్ దశ, సూపర్-8 పోరుల్లో 5 ఓవర్లకు మ్యాచ్‌ను కుదించినట్లుగా సెమీస్‌లోనూ నిర్వహించడానికి కుదరదు. కనీసం 10 ఓవర్ల పాటు ఓ జట్టు ఆడాలి. వరుణుడు తీవ్ర ప్రతాపం చూపిస్తే అంతసేపు ఆట కొనసాగడం కష్టమే. ఈ పరిస్థితుల్లో సూపర్-8 స్టేజ్ గ్రూప్‌ల్లో మెరుగైన స్థానంలో ఉన్న జట్టును.. ఫైనల్‌కు అర్హత సాధించినట్లుగా ప్రకటిస్తారు. గ్రూప్-1లో భారత్ అగ్రస్థానంలో, గ్రూప్-2లో ఇంగ్లండ్ రెండో స్థానంలో ఉంది. దీంతో టీమిండియా ఫైనల్‌కు చేరుతుంది. భారత్-ఇంగ్లండ్ సెమీస్‌కు వరుణుడు ముప్పు పొంచి ఉండటం గమనార్హం.