టీ20 వరల్డ్ కప్-2024ను పాకిస్థాన్ ఓదార్పు విజయంతో ముగించింది. సూపర్-8కు అర్హత సాధించని పాకిస్థాన్ ఆదివారం ఫ్లోరిడా వేదికగా ఐర్లాండ్‌తో నామమాత్రపు మ్యాచ్‌లో తలపడింది. ఉత్కంఠగా సాగిన ఈ పోరులో మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే పాక్‌కు గెలుపు అంత ఈజీగా దక్కలేదు. పాకిస్థాన్‌కు ఐర్లాండ్ ఓటమి భయాన్ని చూపించింది. కానీ బాబర్ సేన ఆఖర్లో పుంజుకుని అంతిమంగా విజయతీరాలకు చేరి ఊపిరిపీల్చుకుంది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 106 పరుగులు చేసింది. గారెత్ డెలానీ (31; 19 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ షాహిన్ అఫ్రిది (3/22) మూడు వికెట్లతో సత్తాచాటాడు. మహ్మద్ అమీర్ (2/11) రెండు వికెట్లు తీశాడు. అయితే టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్ పేలవారంభం దక్కింది. ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయిన ఐర్లాండ్ 32 పరుగులకే ఆరు వికెట్లు చేజార్చుకుంది.

ఈ దశలో బ్యాటింగ్ వచ్చిన డెలానీ టెయిలెండర్లతో కలిసి స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. ఆఖర్లో జోషువా లిటిల్ (22; 18 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) కీలక పరుగులు సాధించడంతో పాకిస్థాన్ ముంగిట ఐర్లాండ్ పోరాడే లక్ష్యాన్ని ఉచ్చింది. అనంతర ఛేదనలో పాక్ 18.5 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి టార్గెట్ అందుకుంది. అయితే పాకిస్థాన్ ఛేజింగ్ ఆసక్తికంగా సాగింది. ఓ దశలో పాక్ 52/2తో మెరుగైన స్థితిలో ఉంది. విజయం దిశగా దూసుకెళ్లింది. కానీ ఐర్లాండ్ బౌలర్ల గొప్ప పోరాటానికి పాకిస్థాన్ ఒక్కసారిగా 62/6తో పీకల్లోతు కష్టాల్లో పడింది.

పాకిస్థాన్‌కు మరో ఘోరపరాజయం తప్పదేమో అనే అంచనాలు భారీగా పెరిగాయి. కానీ అబ్బాస్ అఫ్రిది (17; 21 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్), షాహిన్ అఫ్రిది (13 నాటౌట్; 5 బంతుల్లో, 2 సిక్సర్లు)తో కలిసి కెప్టెన్ బాబర అజామ్ (32 నాటౌట్, 34 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక భాగస్వామ్యాలు నెలకొల్పి జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఐర్లాండ్ బౌలర్లలో బార్రీ మూడు, క్యాంపర్ రెండు వికెట్లు తీశారు.