టీ20 వరల్డ్ కప్‌లో పుష్కర కాలం తర్వాత సూపర్ ఓవర్ పోరు జరిగింది. బార్బడోస్ వేదికగా సూపర్ ఓవర్‌కు దారితీసిన మ్యాచ్‌లో ఒమన్‌పై నమీబియా థ్రిల్లింగ్ విక్టరీ సాధించింది. స్లో పిచ్‌పై సాగిన ఈ మ్యాచ్ ఆద్యంతం హోరాహోరీగా సాగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఒమన్ 19.4 ఓవర్లలో 109 పరుగులకు ఆలౌటైంది. ఖలీద్ కైల్ (34; 39 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) టాప్ స్కోరర్. ట్రంపెల్మన్ (4/21) నాలుగు వికెట్లు, డేవిడ్ వైసే (3/28) మూడు వికెట్లతో సత్తాచాటారు.
ఛేదనలో నమీబియా 20 ఓవర్లకు ఆరు వికెట్లు కోల్పోయి 109 పరుగులే చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. చివరి బంతికి రెండు పరుగులు చేయాల్సిన తరుణంలో నమీబియా ఒక్క పరుగే సాధించింది. జేన్ ఫ్రైలింక్ (45; 48 బంతుల్లో, 6 ఫోర్లు) పోరాడాడు. ఒమన్ బౌలర్ మెహ్రన్ ఖాన్ (3/7) మూడు వికెట్లతో మ్యాచ్‌ను మలుపు తిప్పాడు.

అనంతరం సూపర్ ఓవర్‌లో నమీబియా చెలరేగింది. 21 పరుగులు సాధించింది. డేవిడ్ వైసే తొలి నాలుగు బంతుల్లో 13 పరుగులు సాధించాడు. తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన డేవిడ్ రెండో బంతిని బౌండరీకి తరలించాడు. చివరి రెండు బంతుల్ని ఎరాస్మస్ రెండు ఫోర్లు కొట్టాడు. అయితే సూపర్ ఓవర్ ఛేదనలో ఒమన్ వికెట్ కోల్పోయి 10 పరుగులే చేసింది.
అయితే టీ20 వరల్డ్ కప్‌లో ఓ మ్యాచ్ టై అవ్వడం ఇది నాలుగో సారి. 2007లో జరిగిన తొలి టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. అయితే అప్పటికీ సూపర్ ఓవర్ అమల్లోకి రాలేదు. బౌల్ అవుట్‌తో విజేతను ప్రకటించారు. ఈ బౌల్ అవుట్‌లో పాక్‌పై భారత్ పైచేయి సాధించింది. 2012 వరల్డ్ కప్‌లో న్యూజిలాండ్-శ్రీలంక మ్యాచ్ టై అవ్వడంతో తొలిసారి సూపర్ ఓవర్ నిర్వహించారు. దీనిలో లంక గెలిచింది.
2012 టీ20 వరల్డ్ కప్‌లో వెస్టిండీస్-న్యూజిలాండ్ మ్యాచ్ కూడా టైగా ముగిసింది. ఈ సూపర్ ఓవర్‌లోనూ కివీస్ ఓటమిపాలైంది. పుష్కరకాలం తర్వాత ఇవాళ ఒమన్-నమీబియా మ్యాచ్ టై అయ్యింది. సూపర్ పోరులో నమీబియా విజయం సాధించింది. అయితే ఈ నేపథ్యంలో పాకిస్థాన్ అభిమానులు నెట్టింట్లో విపరీతంగా బాధపడుతున్నారు. తొలి ప్రపంచకప్ సమయంలోనూ సూపర్ ఓవర్ నిర్వహిస్తే తమ జట్టు గెలిచే అవకాశాలు ఉండేయని కామెంట్లు చేస్తున్నారు.