టీ20 వరల్డ్ కప్-2024లో అఫ్గానిస్థాన్ సత్తాచాటుతోంది. శుక్రవారం ట్రిండాడ్ వేదికగా పపువా న్యూ గినియాతో జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్ల తేడాతో నెగ్గి సూపర్-8కు అర్హత సాధించింది. అఫ్గాన్ ఆడిన మూడింట్లో ఘన విజయాల్ని అందుకుంది. కాగా, మొదట బ్యాటింగ్ చేసిన పపువా న్యూ గినియా 19.5 ఓవర్లలో 95 పరుగులకు కుప్పకూలింది. వికెట్ కీపర్ కిప్లిన్ (27; 32 బంతుల్లో, 2 ఫోర్లు) టాప్ స్కోరర్.
అఫ్గాన్ బౌలర్లలో ఫజల్లా ఫరూకీ (3/16) మూడు వికెట్లతో సత్తాచాటాడు. నవీనుల్ రెండు, నూర్ అహ్మద్ ఒక్క వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో అఫ్గానిస్థాన్ 15.1 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.
గుల్బాదిన్ నైబ్ (49 నాటౌట్, 36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడాడు. మహ్మద్ నబీ (16 నాటౌట్, 23 బంతుల్లో, 1 ఫోర్) కీలక పరుగులు చేశాడు.

ఈ మ్యాచ్‌లో పపువా న్యూ గినియా బ్యాటర్లు ఏకంగా నలుగురు రనౌటవ్వడం గమనార్హం. ఓపెనర్ అసాద్ (3; 2 బంతుల్లో), చాద్ (9; 26 బంతుల్లో), నార్మన్ (డకౌట్, 7 బంతుల్లో), సెమో (2; 3 బంతుల్లో) రనౌట్ రూపంలో వెనుదిరిగారు. అయితే నార్మన్ రనౌట్ అయిన తీరు నెట్టింట వైరల్‌గా మారింది. అజ్మతుల్లా వేసిన 13వ ఓవర్ తొలి బంతికి నార్మన్ మిడాన్ మీదుగా షాట్‌కు యత్నించి సింగిల్‌కు ప్రయత్నించాడు. అక్కడే కాచుకుని ఉన్న రషీద్ ఖాన్ బంతిని అందుకుని వికెట్లకు మెరుపు త్రో వేశాడు.
స్టంప్స్‌కు బంతి తగిలేలోపే నార్మన్ క్రీజులోకి వచ్చేలా దూసుకొచ్చాడు. కానీ దురదృష్టవశాత్తు క్రీజుకు ఇంచు దూరంలో బ్యాటు నేలకు తాకి ఆగిపోయింది. ఈ లోపు బంతి వికెట్లను తాకేసింది. దీంతో నార్మన్ అన్‌లక్కీ, దరిద్రాన్ని జేబులో పెట్టుకొని వచ్చాడని నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. కాగా, రనౌట్ రూపంలో తమ బ్యాటర్లు నలుగురు ఔటవ్వడంపై పపువా న్యూ గినియా కెప్టెన్ అసాద్ స్పందిచాడు. అఫ్గానిస్థాన్ బౌలింగ్ యూనిట్ గొప్పదని, కానీ వాళ్లకు నాలుగు వికెట్లు రనౌట్ల రూపంలో గిఫ్ట్‌గా ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని అన్నాడు.