సెయింట్ లూసియా వేదికగా మంగళవారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్‌లో అఫ్గానిస్థాన్‌పై వెస్టిండీస్ 104 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. లీగ్ స్టేజ్‌ను అజేయంగా ముగించి సూపర్-8 దశకు దర్జాగా వెళ్లింది. నికోలస్ పూరన్ (98; 53 బంతుల్లో, 6 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించడంతో మొదట వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 218 పరుగులు చేసింది.
ఓపెనర్ జాన్సన్ చార్లెస్ (43; 27 బంతుల్లో, 8 ఫోర్లు) రాణించారు. కెప్టెన్ పావెల్ (26; 15 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), షై హోప్ (25; 17 బంతుల్లో, 2 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. గుల్బాదిన్ నైబ్ (2/14) రెండు వికెట్లు, నవీనుల్ హక్ (1/41), అజ్మతుల్లా (1/41) తలో వికెట్ తీశారు.

అనంతరం ఛేదనలో అఫ్గానిస్థాన్ 16.2 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది. ఇబ్రహీం జద్రాన్ (38; 28 బంతుల్లో, 5 ఫోర్లు,1 సిక్సర్) టాప్ స్కోరర్. ఒబెడ్ మెక్కాయ్ (3/14) మూడు, అకీల్ హొస్సేన్ (2/21), మొయెట్జీ (2/28) చెరో రెండు వికెట్లు తీశారు. అయితే మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్న పూరన్ అరుదైన ఘనత సాధించాడు.
అఫ్గాన్‌పై ఎనిమిది సిక్సర్లతో విజృంభించిన పూరన్.. క్రిస్ గేల్ ఆల్‌టైమ్ సిక్సర్ల రికార్డును బ్రేక్ చేశాడు. టీ20ల్లో వెస్టిండీస్ తరఫున అత్యధిక సిక్సర్లు బాదిన వీరుడిగా నికోలస్ పూరన్ కొత్త చరిత్రను లిఖించాడు. అంతకుముందు ఈ రికార్డు గేల్ పేరిట ఉంది. పొట్టి ఫార్మాట్‌లో పూరన్ 128 సిక్సర్ల బాదగా గేల్ 124 సిక్సర్లు సాధించాడు. ఈ ఇద్దరి తర్వాతి స్థానాల్లో ఎవిన్ లివస్ (111), కీరన్ పొలార్డ్ (99), పావెల్ (90) ఉన్నారు.
ఇక మెన్స్ టీ20ల్లో (ఫ్రాంచైజీ లీగ్ మ్యాచ్‌లతో కలిపి) ఓవరాల్‌గా 500 సిక్సర్ల మార్క్‌ను అందుకున్న ఆరో బ్యాటర్‌గా పూరన్ రికార్డులకెక్కాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (1056), పొలార్డ్ (860), రసెల్ (686), మన్రో (548), రోహిత్ శర్మ (512), నికోలస్ పూరన్ (502) ఉన్నారు.