బార్బడోస్ వేదికగా అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టింది. తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి గ్రూప్-2 పాయింట్ల టేబుల్‌లో రెండో స్థానానికి చేరింది. సెమీస్ ఆశలు సజీవంగా ఉంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన యునైటెడ్ స్టేట్స్ 19.5 ఓవర్లలో 128 పరుగులకు ఆలౌటైంది. ఆండ్రీస్ గౌస్ (29; 16 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్.
వెస్టిండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ (3/19, రసెల్ (3/31) చెరో మూడు వికెట్లు, అల్జారీ జోసెఫ్ (2/31) రెండు వికెట్లతో సత్తాచాటారు. పవర్‌ప్లేలో అమెరికా 48/1తో సత్తాచాటినా తర్వాత విండీస్ బౌలర్లు క్రమంగా వికెట్లు తీసి దెబ్బకొట్టారు. అనంతరం ఛేదనలో వెస్టిండీస్ 10.5 ఓవర్లలోనే వికెట్ కోల్పోయి ఘన విజయం సాధించింది. ఓపెనర్ షై హోప్ (82 నాటౌట్; 39 బంతుల్లో, 4 ఫోర్లు, 8 సిక్సర్లు) విధ్వంసం సృష్టించాడు. నికోలస్ పూరన్ (27; 12 బంతుల్లో, 1 ఫోర్, 3 సిక్సర్లు) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు.

జాన్సన్ చార్లెస్ (15; 14 బంతుల్లో, 2 ఫోర్లు) నిలకడగా ఆడినా హోప్ చెలరేగడంతో వెస్టిండీస్ పవర్‌ప్లేలో 58 పరుగులు చేసింది. అయితే ఏడో ఓవర్‌లో జాన్సన్ ఔటవ్వడంతో వెస్టిండీస్ స్కోరుబోర్డు మరింత వేగంగా పరుగులు పెట్టింది. హోప్‌కు పూరన్ చక్కని సహకారం అందించాడు. ఓ బౌండరీ, మూడు సిక్సర్లతో జట్టు వేగంగా విజయతీరాలకు చేరడంతో కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డు బద్దలుకొట్టాడు.
ఓ టీ20 వరల్డ్ కప్ ఎడిషన్‌లో అత్యధిక సిక్సర్లు సాధించిన ప్లేయర్‌గా నికోలస్ పూరన్ చరిత్ర సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో పూరన్ టాప్ స్కోరర్. ఆరు మ్యాచ్‌ల్లో 45 సగటుతో, 148 స్ట్రైక్‌రేటుతో 227 పరుగులు చేశాడు. ఇందులో 15 ఫోర్లు, 17 సిక్సర్లు ఉన్నాయి. కాగా, అంతకుముందు అత్యధిక సిక్సర్ల రికార్డు యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ పేరిట ఉండేది. 2012 టీ20 వరల్డ్ కప్‌లో గేల్ 16 సిక్సర్లు బాదాడు. పుష్కరకాలం తర్వాత ఈ రికార్డు బ్రేక్ అయ్యింది. ఈ జాబితాలో పూరన్ (17), గేల్ (16), మార్లోన్ శామ్యూల్స్ (15 సిక్సర్లు, 2012), షేన్ వాట్సన్ (15 సిక్సర్లు, 2012) ఉన్నారు.
అంతేగాక హోప్‌తో కలిసి పూరన్ రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. హోప్-పూరన్ రెండో వికెట్‌కు 23 బంతుల్లో 63 పరుగులు సాధించారు. టీ20 వరల్డ్ కప్‌లో 50+ పార్టనర్‌షిప్‌ను అత్యధిక రన్‌రేటుతో అందుకున్న వెస్టిండీస్ రెండో జోడీగా హోప్-పూరన్ నిలిచారు. వీరిద్దరు 16.43 రన్‌రేటుతో పరుగులు సాధిస్తూ భాగస్వామ్యం నెలకొల్పారు. అంటే సుమారు ఓవర్‌కు 16 పరుగులు చేశారు. ఈ జాబితాలో టాప్‌లో ఆండ్రీ ఫ్లెచర్-బ్రాండన్ కింగ్ (17.40 రన్‌రేటు) ఉన్నారు.