
టీ20ప్రపంచకప్ - 2022లో భాగంగా మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో అక్టోబరు 23న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనున్న సంగతి తెలిసిందే. ఇకపోతే ఈ మ్యాచ్ పట్ల యావత్ క్రికెట్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఇక ఈ మ్యాచ్ టిక్కెట్లు అన్నీ సేల్ అయిపోయినట్లు అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) గురువారం వెల్లడించింది. అదనపు స్టాండింగ్ రూమ్ టిక్కెట్లు కూడా సేల్ మొదలెట్టిన కొన్ని నిమిషాల్లోనే సేల్ అయినట్లు అని ఐసీసీ తెలిపింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో జరగనున్న మెగా ఈవెంట్ కోసం 5లక్షల టిక్కెట్లు ఇప్పటివరకు అమ్ముడయ్యాయని ఐసీసీ తెలిపింది.
భారత్, పాకిస్థాన్‌లు తమ తొలి సూపర్ 12మ్యాచ్‌లో తలపడనున్నాయి. 'ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2022 అన్ని వయసుల మరియు నేపథ్యాల అభిమానులను స్వాగతించడానికి సిద్ధంగా ఉంది, ఒక నెల వ్యవధిలో ప్రారంభమయ్యే ఈవెంట్‌కు 500,000 మంది అభిమానులు ఇప్పటికే తమ టిక్కెట్లు పొందారు" అని ఐసీసీ తన ప్రకటనలో తెలిపింది.
'2020లో మహిళల టీ20 ప్రపంచ కప్ తర్వాత ఐసీసీ ఈవెంట్‌లలో తొలిసారిగా పూర్తిస్థాయిలో స్టేడియాల్లో అభిమానులను అనుమతించిన నేపథ్యంలో 16అంతర్జాతీయ జట్ల ఆటగాళ్లు పాల్గొనే ఈ టోర్నీ మ్యాచ్‌లను చూడటానికి 82వేర్వేరు దేశాల నుంచి అభిమానులు టిక్కెట్లను కొనుగోలు చేశారు. ఫైనల్ మ్యాచ్ కోసం 86,174మంది అభిమానులు టిక్కెట్లు బుక్ చేసుకున్నారు. ఫైనల్ మెల్ బోర్న్ క్రికెట్ గ్రౌండ్లో జరగనున్న సంగతి తెలిసిందే.
అక్టోబర్ 23న MCGలో జరిగే ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ టిక్కెట్లు కూడా పూర్తిగా అమ్ముడయిపోయాయి. ఇకపోతే ఈవెంట్‌కు ముందు మరోసారి అధికారిక రీ-సేల్ ప్లాట్‌ఫాం మొదలవుతుంది.అప్పుడు అభిమానులు టిక్కెట్లను మార్చుకోవచ్చు. లేదా కొనుక్కోవచ్చు' ఐసీసీ చెప్పింది.
బంగ్లాదేశ్‌తో అలాగే దక్షిణాఫ్రికాతో ఇండియా తలపడే గ్రూప్ ఏ మ్యాచ్‌లు కూడా దాదాపు అమ్ముడుపోయాయి. అయితే అదనపు టిక్కెట్ల కోటా ఇంకా రిలీజ్ కావాల్సి ఉంది. ఇకపోతే అక్టోబర్ 22న సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో న్యూజిలాండ్‌తో ఆస్ట్రేలియా ప్రారంభ సూపర్ 12 మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ టికెట్లు కూడా దాదాపు అమ్ముడయ్యాయి. చాలా పరిమిత సంఖ్యలో టిక్కెట్లు మిగిలి ఉన్నాయి. t20worldcup.comలో టిక్కెట్ల సేల్స్ జరుగుతున్న సంగతి తెలిసిందే.