ఇండియా-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచంటే రెండు దేశాల అభిమానుల్లో ఎక్కడ లేని ఉత్సాహం, ఉత్సుకత కనిపిస్తుంది. అంతేగాక ప్రపంచమంతా ఈ ఫైట్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తుంటుంది. ఆ రేంజ్‌లో ఇరు జట్ల మధ్య ఫైట్ ఉంటుంది. తల అయినా తెంచుకుంటాం కానీ ఓటమిని ఒప్పుకోమనే రీతిలో.. ఆటలో ఉద్రిక్తత, భావోద్వేగం కనిపిస్తుంటుంది. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్ కప్‌లో పాక్‌ను భారత్ చిత్తుగా ఓడించింది.
అయితే భారత్-పాక్ మరో పోరుకు రంగం సిద్ధమైంది. టీ20 ప్రపంచకప్ లో ఇరు జట్ల మధ్య జరిగే గ్రూప్ మ్యాచ్‌కు వేదిక దాదాపు ఖరారైంది. వచ్చే ఏడాది జూన్ లో టీ20 వరల్డ్ కప్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మెగా టోర్నీకి అమెరికా, వెస్టిండీస్ దేశాలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్నాయి. ఇప్పటికే ఐసీసీ అధికారులు ఆ దేశాల్లో పర్యటిస్తూ షెడ్యూల్‌కు ప్రణాళిక రచించారు.

అమెరికాలో మూడు వేదికల్లో మ్యాచ్‌లు నిర్వహించాలని భావిస్తున్నారు. ఫ్లోరిడా, టెక్సాస్‌తో పాటు న్యూయార్క్‌లోని ఐసెన్‌హోవర్ పార్క్‌లో మ్యాచ్‌లు జరగనున్నాయి. అయితే న్యూయార్క్‌లో భారత్-పాక్ గ్రూప్ స్టేజ్ మ్యాచ్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ వేదికను టోర్నీ కోసం తాత్కాలికంగా ఏర్పాటు చేసినట్లు సమాచారం.
న్యూయార్క్‌లోని ఈ స్టేడియం కెపాసిటీ సుమారు 34,000. కాగా, న్యూయార్క్ లో దాదాపు ఏడు లక్షల మంది భారత్ సంతతికి చెందినవారు ఉండగా, పాక్ మూలాలున్న వారు లక్ష మంది వరకు ఉన్నారు. న్యూయార్క్‌కు మనకు పదిన్నర గంటల సమయం తేడా ఉంటుంది. ఇక టీ20 ప్రపంచకప్ ఫైనల్‌ను కరేబియన్ దీవుల్లోని బార్బడోస్‌లో నిర్వహించాలని భావిస్తున్నారు. 2007 వన్డే ప్రపంచకప్, 2010 టీ20 కప్ ఫైనల్స్ బార్బడోస్‌లోనే జరిగాయి.
అయితే ఈ సారి టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు పోటీపడుతున్నాయి. అయిదు జట్లను ఒక గ్రూప్‌గా ఎంపిక చేసి అన్ని జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజిస్తారు. గ్రూప్‌ల్లో నిలిచిన టాప్-2 జట్లు సూపర్-8కి అర్హత సాధిస్తాయి. ఈ సూపర్-8 జట్లను కూడా రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. వాటిలో తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి. సెమీస్‌లో గెలిచిన జట్లు ఫైనల్‌కు వెళ్తాయి.