Afghanistan Semi Final Scenario: టీ20 వరల్డ్ కప్-2024 సంచలనాలకు వేదికగా మారుతోంది. లీగ్ దశలో పాకిస్థాన్‌పై అమెరికా గెలిచి ఈ ట్రెండ్‌ను ఆరంభించగా అఫ్గానిస్థాన్ దాన్ని అద్భుతంగా కొనసాగిస్తోంది. తొలుత న్యూజిలాండ్‌పై గెలిచిన అఫ్గాన్.. ఇవాళ ఆస్ట్రేలియాకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈ గెలుపుతో గ్రూప్-1 టీమ్స్ సెమీస్ సమీకరణాలు ఒక్కసారిగా తారుమారయ్యాయి. అఫ్గాన్ సెమీఫైనల్స్ అవకాశాలను గణనీయంగా మెరుగయ్యాయి.
ఎంతలా అంటే.. రేపటి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఓటమిపాలైనా, అఫ్గానిస్థాన్‌కు అవకాశాలు గొప్పగానే ఉన్నాయి. సూపర్-8లోని గ్రూప్-1లో భారత్, బంగ్లాదేశ్, అఫ్గానిస్థాన్, ఆస్ట్రేలియా జట్లు ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం టీమిండియా (4 పాయింట్లు, +2.425 నెట్‌రన్‌రేటు) అగ్రస్థానంలో ఉంది. తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా (2 పాయింట్లు, +0.223), అఫ్గానిస్థాన్ (2 పాయింట్లు, -0.650), బంగ్లాదేశ్ (-2.489 నెట్‌రన్‌రేటు) ఉన్నాయి.

గ్రూప్-1లో ప్రతి జట్టుకు ఇంకా సెమీస్ అవకాశాలు ఉన్నాయి. ఆడిన రెండింట్లో ఓటమిపాలైన బంగ్లాదేశ్ కూడా సెమీస్ రేసులో ఉంది. అయితే బంగ్లా నాకౌట్ దశకు చేరాలంటే ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించాలి. అలాగే అఫ్గానిస్థాన్‌పై బంగ్లా రికార్డు విజయం సాధించి.. ఆసీస్, అఫ్గాన్ కంటే మెరుగైన నెట్‌రన్‌రేటు సంపాదించుకుంటే సెమీస్‌కు చేరొచ్చు. ఇది జరిగే అవకాశాలు చాలా తక్కువ. ఇక భారత్ విషయానికొస్తే..ఆస్ట్రేలియాపై గెలిస్తే సెమీస్ బెర్తు కన్ఫార్మ్ చేసుకుంది.
ఒక వేళ టీమిండియా ఓటమిపాలైనా అవకాశాలు ఉంటాయి. అయితే బంగ్లాదేశ్ చేతిలో అఫ్గానిస్థాన్ ఓడాలి. కానీ బంగ్లాపై అఫ్గాన్ గెలిస్తే రోహిత్ సేన నెట్‌రన్‌రేటుపై ఆధారపడాల్సి ఉంటుంది. ఆస్ట్రేలియా విషయానికొస్తే.. భారత్‌పై తప్పక విజయం సాధించాలి. ఓటమిపాలైతే అఫ్గానిస్థాన్‌పై బంగ్లాదేశ్ గెలవాలని కంగారూలు పూజలు చేయాలి. అఫ్గానిస్థాన్‌ది డిఫ్రెంట్ స్టోరీ. మరో మ్యాచ్ మిగిలుండగానే భారత్ సెమీస్‌కు చేరే అవకాశాన్ని అఫ్గాన్ భగ్నం చేసింది.
ఆస్ట్రేలియా చేతిలో అఫ్గాన్ ఓడి ఉంటే భారత్ ఇప్పటికే సెమీస్‌కు చేరుకునేదే. అయితే సంచలన విజయంతో అఫ్గాన్ సెమీస్ రేసులో దూసుకొచ్చింది. నాకౌట్ దశకు చేరాలంటే అఫ్గాన్ ముందు రెండు దారులు ఉన్నాయి. ఒకటి.. బంగ్లాదేశ్‌పై అఫ్గానిస్థాన్ విజయం సాధించాలి, అలాగే ఆస్ట్రేలియాపై భారత్ తప్పక గెలవాలి. ఇక రెండోది.. నెట్ రన్ రేటుకు సంబంధించింది. ఆస్ట్రేలియా చేతిలో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓటమిపాలైతే.. బంగ్లాదేశ్‌పై కనీసం అఫ్గాన్ 36+ పరుగుల తేడాతో గెలవాలి. అప్పుడు ఆస్ట్రేలియా నెట్‌రన్‌రేటును అఫ్గాన్ అధిగమించి సెమీస్‌కు చేరి చరిత్ర సృష్టించగలదు.