రోహిత్ శర్మ, విరాట్ కోహ్లి తిరిగి టీ20 జట్టులోకి రావడాన్ని టీమిండియా మాజీ క్రికెటర్లు స్వాగతిస్తున్నారు. జూన్‌లో టీ20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ఈ స్టార్ ప్లేయర్లు పొట్టి ఫార్మాట్‌లో అందుబాటులో ఉండటం భారత్‌ను మరింత బలోపేతం చేస్తుందని అభిప్రాయపడుతున్నారు. జనవరి 11 నుంచి స్వదేశంలో భారత్ మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ కోసం భారత జట్టును బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. దాదాపు 14 నెలల తర్వాత రోహిత్, కోహ్లి తిరిగి టీమిండియా టీ20 జట్టులో చేరారు.
మాజీ క్రికెటర్ శ్రీకాంత్ మాట్లాడుతూ.. ''టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మనే అని సంకేతాలు వచ్చేశాయి. హార్దిక్ పాండ్య, సూర్యకుమార్ యాదవ్, బుమ్రా లేకపోవడంతో రోహిత్‌కు కెప్టెన్సీ వచ్చిందని భావించొద్దు. సహజంగానే రోహిత్ కెప్టెన్‌గా ఉంటాడు. రోహిత్‌ను కాదని హార్దిక్ పాండ్యను కెప్టెన్ చేయడం ముంబయి ఇండియన్స్ ఫ్రాంచైజీ విషయం. కానీ టీ20 ప్రపంచకప్‌లో భారత్‌కు రోహిత్ శర్మనే కెప్టెన్‌గా ఉంటాడు. దానికి తగ్గట్టుగానే అడుగులు మొదలయ్యాయి''

''వచ్చే ఐపీఎల్ సీజన్‌లో రోహిత్ శర్మ స్వేచ్ఛగా ఆడతాడు. వన్డే ప్రపంచకప్‌లో ఆడినట్టుగానే ఎటాకింగ్ గేమ్ ఆడతాడు. అయితే ప్రపంచకప్ ఓటమి గాయం రోహిత్‌కు ఇంకా తగ్గలేదు. ఆస్ట్రేలియాపై ఫైనల్‌లో గెలిచి ఉంటే పరిస్థితులు భిన్నంగా ఉండేవి. కెప్టెన్‌గా ప్రపంచకప్ సాధించాలని కసిగా ఉన్నాడు. టీ20 కప్‌ను అందుకోవాలని భావిస్తున్నాడు'' అని శ్రీకాంత్ అన్నాడు.
టీమిండియా మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా మాట్లాడుతూ.. '' టీమిండియా టీ20లకు రోహిత్ కెప్టెన్‌గా తిరిగొచ్చాడు. అతడు టీ20 ప్రపంచకప్‌లో కూడా సారథిగా ఉంటాడని భావిస్తున్నా. హార్దిక్ పాండ్య తిరిగొస్తే అతడికి కెప్టెన్సీ బాధ్యతలు ఇస్తారని అనుకోకండి. ఇది రాసిపెట్టుకోండి. అయితే ఏ విషయం గురించి అయినా నేను పెద్దగా హామీలు ఇవ్వను. కానీ రోహిత్ కెప్టెన్సీ గురించి అయితే పక్కాగా చెప్పగలను'' అని పేర్కొన్నాడు.