డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ జూలు విదిల్చింది. సూపర్-8కు అర్హత సాధించాలంటే భారీ విజయం సాధించాల్సిన తరుణంలో పసికూన ఒమన్‌పై పంజా విసిరింది. ఆంటిగ్వా వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో మొదట బంతితో తర్వాత బ్యాటుతో చెలరేగి ఎనిమిది వికెట్ల తేడాతో ఘనంగా నెగ్గింది. టీ20 ప్రపంచకప్-2024లో మూడు మ్యాచ్‌లు ఆడిన ఇంగ్లండ్ బోణీ కొట్టింది.
మొదట బ్యాటింగ్ చేసిన ఒమన్ 13.2 ఓవర్లలో 47 పరుగులకు ఆలౌటైంది. అదిల్ రషీన్ (4/11) నాలుగు వికెట్లతో, మార్క్ వుడ్ (3/12), జోఫ్రా ఆర్చర్ (3/12) చెరో మూడు వికెట్లతో విజృంభించారు. ఒమన్ బ్యాటర్లలో షోయబ్ ఖాన్ (11; 23 బంతుల్లో, 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరు అందుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఒమన్‌ను ఆదిలోనే ఆర్చర్, మార్క్ వుడ్ వరుసగా దెబ్బకొట్టారు. క్రమంగా వికెట్లు తీయడంతో పవర్‌ప్లేలో ఒమన్ నాలుగు వికెట్ల నష్టానికి 25 పరుగులు చేసింది.

పవర్‌ప్లే ముగిసిన అనంతరం బంతి అందుకున్న రషీద్ వికెట్ల వేట మొదలుపెట్టాడు. తొలి బంతికే వికెట్ సాధించాడు. అదే జోరు కొనసాగడంతో 36 పరుగులకే ఒమన్ ఎనిమిది వికెట్ల కోల్పోయింది. షోయబ్ ఖాన్ కాస్త ప్రతిఘటించడంతో స్కోరుబోర్డు 47 పరుగుల వరకు చేరింది. అనంరం ఛేదనలో ఇంగ్లండ్ రెండు వికెట్లు కోల్పోయి 3.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. కెప్టెన్ బట్లర్ (24 నాటౌట్; 8 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) ఒమన్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
ఛేజింగ్‌లో తొలి రెండు బంతులనే ఫిల్ సాల్ట్ (12; 3 బంతుల్లో, 2 సిక్సర్లు) స్టాండ్స్‌కు తరలించాడు. అయితే మూడో బంతికి మరో షాట్‌కు యత్నించి ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన విల్ జాక్స్ (5; 7 బంతుల్లో, 1 ఫోర్) ఎక్కువసేపు క్రీజులో నిలవలేదు.దీంతో ఇంగ్లండ్ 2 ఓవర్లకు 24/2తో నిలిచింది. అయితే మూడో ఓవర్‌లో బట్లర్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. బిలాల్ ఖాన్ బౌలింగ్‌లో బట్లర్ నాలుగు బౌండరీలు, ఒక సిక్సర్ బాది 22 పరుగులు పిండుకున్నాడు. ఆ తర్వాత 3.1 బంతిని బెయిర్ స్టో (8 నాటౌట్; 2 బంతుల్లో, 2 ఫోర్లు) ఫోర్ కొట్టడంతో ఇంగ్లండ్ సూపర్-8 రేసులో ముందంజలో వేసింది.