టీ20 వరల్డ్ కప్-2024లో ఆస్ట్రేలియా బోణీ కొట్టింది. బార్బడోస్ వేదికగా గురువారం ఒమన్‌తో జరిగిన గ్రూప్-బీ మ్యాచ్‌లో 39 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా నిర్ణీత 20 ఓవర్లలో అయిదు వికెట్లకు 164 పరుగులు చేసింది. మార్కస్ స్టోయినిస్ (67 నాటౌట్; 36 బంతుల్లో, 2 ఫోర్లు, 6 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (56; 51 బంతుల్లో, 6 ఫోర్లు, 1 సిక్సర్) అర్ధశతకాలు సాధించారు. మెహ్రన్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు.
అనంతరం ఛేదనలో 20 ఓవర్లలో ఒమన్ తొమ్మిది వికెట్లు కోల్పోయి 129 పరుగులు చేసింది. అయాన్ ఖాన్ (36; 30 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) టాప్ స్కోరర్. స్టొయినిస్ మూడు వికెట్లతో సత్తాచాటాడు. స్టార్క్, ఎలిస్, జంపా తలో రెండు వికెట్లు తీశారు. అయితే ఆసీస్ ఇన్సింగ్స్ మొదట్లో చాలా నెమ్మదిగా సాగింది. 12 ఓవర్లకు 63/3 స్కోరు మాత్రమే సాధించింది. ఆ తర్వాత స్టొయినిస్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 27 బంతుల్లో అర్ధశతకం అందుకున్నాడు.

మరో ఎండ్‌లో వార్నర్ జాగ్రత్తగా ఆడుతూ స్టొయినిస్‌కు సహకరించాడు. 46 బంతుల్లో 50 పరుగుల మార్క్‌ను సాధించాడు. ఈ క్రమంలో వార్నర్ అరుదైన రికార్డు సాధించాడు. మెన్స్ టీ20 క్రికెట్‌లో అత్యధిక అర్ధశతకాలు సాధించిన ఆటగాడిగా వార్నర్ చరిత్రకెక్కాడు. పొట్టి ఫార్మాట్‌లో వార్నర్ 111 హాఫ్ సెంచరీలు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు క్రిస్ గేల్ పేరిట (110) ఉంది. 50+ స్కోర్లు అత్యధిక సార్లు సాధించిన ఆటగాళ్ల జాబితాలో వార్నర్, గేల్, విరాట్ కోహ్లి (105), బాబర్ అజామ్ (101), జాస్ బట్లర్ (89) ఉన్నారు.
అంతర్జాతీయ టీ20ల్లో వార్నర్‌కు ఇది 27వ హాప్ సెంచరీ. కాగా, ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో వార్నర్ మరో రికార్డు నెలకొల్పాడు. ఆస్ట్రేలియా తరఫున టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వార్నర్ నిలిచాడు. ఈ జాబితాలో వార్నర్ (3155), ఆరోన్ ఫించ్ (3120), గ్లెన్ మాక్స్‌వెల్ (2468), షేన్ వాట్సన్ (1462) టాప్-4లో ఉన్నారు.