టీ20 ప్రపంచకప్ ఏమైనా ఫర్వాలేదు.. ఐపీఎల్‌కు మాత్రం ఏం జరగొద్దా?: అక్తర్ ఫైర్

కరాచీ: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) కోసమే అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టీ20 ప్రపంచకప్‌ను వాయిదా వేసిందంటూ పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్ ఆరోపించారు. ఆర్థికంగా లాభపడటం కోసమే బోర్డులన్నీ ఇందుకు అంగీకరించాయని పేర్కొన్నారు. ప్రపంచకప్ కాకుండా ఐపీఎల్ జరిగితేనే ఆదాయం వస్తుందని భావించిన క్రికెట్ బోర్డులు.. ఐసీసీని ప్రభావితం చేశాయన్నారు. చాలా బోర్డులు ఆర్థిక స్వప్రయోజనాలు చూసుకున్నాయని మరో పాక్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కూడా ఫైర్ అయ్యారు.

ప్రపంచకప్ వాయిదా:
కరోనా వైరస్ ముప్పుతో ఆస్ట్రేలియా వేదికగా నవంబర్-నవంబర్‌లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్‌ను సోమవారం ఐసీసీ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అంతకుముందే ఆసియా కప్ వాయిదా పడటంతో.. ఐపీఎల్ 2020 నిర్వహించేందుకు బీసీసీఐకి సరైన విండో దొరికింది. వచ్చే పది రోజుల్లోపు ఐపీఎల్ పాలక మండలి సమావేశమై షెడ్యూలుపై చర్చిస్తుందని ఛైర్మన్ బ్రిజేష్ పటేల్ సైతం పేర్కొన్నారు. యూఏఈ వేదికగా ఐపీఎల్ జరగనుందని సమాచారం.

ఐపీఎల్ కోసమే ప్రపంచకప్ వాయిదా:
తాజాగా జియో క్రికెట్‌తో షోయబ్ అక్తర్ మాట్లాడుతూ... 'శక్తిమంతమైన క్రికెట్ బోర్డు విధానాలను రూపొందిస్తుంది. వారి వల్ల ఇతరులు కూడా బాధపడాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచకప్, ఆసియా కప్ ఈ ఏడాది జరగాల్సింది. అప్పుడు భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య మ్యాచ్ ఉండేది. కానీ వారలా చేయలేదు. దీని వెనక చాలా కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం వాటిని చెప్పలేను. టీ20 ప్రపంచకప్ జరగదని నేను ఎప్పట్నుంచో చెబుతున్నా. టీ20 ప్రపంచకప్‌కు ఏమైనా ఫర్వాలేదు కానీ ఐపీఎల్‌కు ఏం జరగొద్దు. క్రికెట్ నాణ్యత దెబ్బతింటున్నప్పటికీ ఆట నుంచి లక్షల డాలర్లు సంపాదించడమే వారికి ముఖ్యం' అని అక్తర్ ఫైర్ అయ్యారు.

ఆర్థిక ప్యాకేజీల కోసమే:
అదే షోలో రషీద్ లతీఫ్ మాట్లాడుతూ... 'భారత్, పాకిస్థాన్, ఇంగ్లండ్ మరేదైనా కానివ్వండి. అన్ని బోర్డులూ ఆర్థిక ప్యాకేజీల కోసమే చూస్తున్నాయి. బీసీసీఐ ఒక్కటే కాదు ఈ వ్యవహారంలో అన్ని బోర్డులూ ఐకమత్యంగానే ఉన్నాయి. ఫిబ్రవరి-మార్చిలో టీ20 ప్రపంచకప్ పెట్టొచ్చు. కానీ పీఎస్‌ఎల్‌కు నష్టం. ఏప్రిల్-మే అయితే ఐపీఎల్‌కు, నవంబర్-డిసెంబర్ అయితే బిగ్‌బాష్‌కు నష్టం. అందుకే ఐసీసీ నిర్ణయంలో అన్ని బోర్డులూ ప్రయోజనం వెతుకున్నాయి. ఆసియా కప్ వాయిదాపై సౌరవ్ గంగూలీ ముందుగానే చెప్పాడంటే అతడికి పాక్ లేదా లంక బోర్డులే చెప్పుండాలి' అని అన్నారు.

సెప్టెంబర్ 19 నుండే:
ఈ ఏడాది ఐపీఎల్ సీజన్‌ను సెప్టెంబర్ 26 నుంచి నవంబర్ 8 వరకు యూఏఈలో నిర్వహిస్తామని బీసీసీఐ ఇప్పటికే ఫ్రాంఛైజీలకు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. అయితే ఈ షెడ్యూల్‌పై ప్రసారదారు స్టార్ ఇండియా అసంతృప్తితో ఉంది. టోర్నీని మరో వారం రోజులు పొడిగించాలని స్టార్‌స్పోర్ట్స్ డిమాండ్ చేస్తోంది. దీంతో స్టార్ నిర్ణయాలకు అనుగుణంగా షెడ్యూల్‌తో పాటు మ్యాచ్ సమయాల్లో మార్పులు చేయడానికి బీసీసీఐ సుముఖంగా ఉన్నట్టు సమాచారం. స్టార్ ఇండియా ఒత్తిడి నేపథ్యంలో సెప్టెంబర్ 26 నుంచి కాకుండా.. సెప్టెంబర్ 19 నుండే లీగ్ ప్రారంభించాలని బీసీసీఐ చూస్తోందట.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications