టైటిల్ లక్ష్యంగా టీ20 వరల్డ్ కప్‌లో అడుగుపెట్టిన భారత్ ట్రోఫీకి మరో అడుగు దూరంలో నిలిచింది. గయానా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 68 పరుగుల తేడాతో ఘన విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. టైటిల్ పోరులో బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో టీమిండియా శనివారం తలపడనుంది.
మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లకు 171 పరుగులు చేసింది. విరాట్ కోహ్లి (9), రిషభ్ పంత్ (4) విఫలమైనా కెప్టెన్ రోహిత్ శర్మ (57; 39 బంతుల్లో, 6 ఫోర్లు, 2 సిక్సర్లు), సూర్యకుమార్ యాదవ్ (47; 36 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు) సత్తాచాటారు. ఆఖర్లో హార్దిక్ పాండ్య (23; 13 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు), రవీంద్ర జడేజా (17 నాటౌట్; 9 బంతుల్లో, 2 ఫోర్లు) కీలక పరుగులు చేశారు.

క్రిస్ జోర్డాన్ మూడు (3/37) మూడు వికెట్లు తీశాడు. అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 16.4 ఓవర్లలో 103 పరుగులకే కుప్పకూలింది. హ్యారీ బ్రూక్ (25; 19 బంతుల్లో, 3 ఫోర్లు) టాప్ స్కోరర్. కుల్‌దీప్ యాదవ్ (3/19), అక్షర్ పటేల్ (3/23) చెరో మూడు వికెట్లు, బుమ్రా (2/12) రెండు వికెట్లతో విజృంభించారు. అయితే మ్యాచ్ విజయానంతరం అంపైర్ నుంచి బుమ్రాకు చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగిదంటే..
ఓటమి అంతరాన్ని తగ్గిస్తున్న జోఫ్రా ఆర్చర్ (21; 15 బంతుల్లో, 1 ఫోర్, 2 సిక్సర్లు)ను బుమ్రా ఎల్బీడబ్ల్యూగా ఔట్ చేసి భారత్‌కు విజయాన్ని అందించాడు. అయితే ఆర్చర్ రివ్యూని కోరాడు. సమీక్షలో కూడా ఔట్ అని తేలడంతో ఇంగ్లండ్ ఓటమి ఖరారైంది. దీంతో అంపైర్లకు భారత ఆటగాళ్లు షేక్ హ్యాండ్ ఇచ్చి మైదానాన్ని వీడటాన్ని ప్రారంభించారు. ఈ క్రమంలో అంపైర్‌కు బుమ్రా షేక్ హ్యాండ్ ఇవ్వడానికి ప్రయత్నించాడు.
కానీ అంపైర్ మాత్రం బుమ్రాను విస్మరించి మిగిలిన ఆటగాళ్లకు షేక్ హ్యాండ్ ఇచ్చాడు. మరోవైపు బుమ్రా తన చేయిని అలాగే ఉంచి ఎదురుచూశాడు. ఈ మధ్యలో అంపైర్ బుమ్రాకు క్యాప్ ఇచ్చాడు కానీ కరచాలనం చేయకపోవడం గమనార్హం. అయితే ఈ ఘటన పొరపాటున జరిగినప్పటికీ దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బుమ్రాకు చేదు అనుభవం ఎదురైందని, స్పీడస్టర్‌ను అంపైర్ ఔట్ చేశాడని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.