టీ20 వరల్డ్ కప్-2024లో అఫ్గానిస్థాన్ సంచలన ప్రదర్శన చేస్తోంది. గ్రూప్ స్టేజ్‌లో న్యూజిలాండ్‌ను చిత్తు చేసిన అఫ్గాన్ ఇవాళ సూపర్-8లో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది. స్ఫూర్తిదాయక ప్రదర్శనతో ఆసీస్‌పై చారిత్రక విజయాన్ని అందుకుంది. అయితే గత వరల్డ్ కప్‌ల్లోనే ఆస్ట్రేలియాపై నెగ్గేవాళ్లమని, కానీ తృటిలో గెలుపును చేజార్చుకున్నామని అప్గానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ అన్నాడు. కానీ ఈ సారి ఎలాంటి పొరపాటు చేయకుండా విజయతీరాలకు చేరామని తెలిపాడు.
కింగ్స్‌టౌన్‌లోని సెయింట్ విన్సెంట్ వేదికగా ఆదివారం జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియాపై 21 పరుగుల తేడాతో అఫ్గానిస్థాన్ ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన అఫ్గానిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లకు 148 పరుగులు చేసింది. ఓపెనర్లు గుర్బాజ్ (60; 49 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), ఇబ్రహీం జద్రాన్ (51; 48 బంతుల్లో, 6 ఫోర్లు) అర్ధశతకాలతో సత్తాచాటారు.ఆడమ్ జంపా (2/28) రెండు వికెట్లు తీశాడు.

అనంతరం ఛేదనలో ఆస్ట్రేలియా 19.2 ఓవర్లలో 127 పరుగులకు ఆలౌటైంది. గుల్బాదిన్ నైబ్ (4/20) నాలుగు, నవీనుల్ హక్ (3/20) మూడు వికెట్లతో ఆసీస్ పతనాన్ని శాసించారు.గత వన్డే వరల్డ్ కప్ తరహాలో జట్టును గెలిపించాలనుకున్న గ్లెన్ మాక్స్‌వెల్ (59; 41 బంతుల్లో, 6 ఫోర్లు, 3 సిక్సర్లు)కు ఈసారి నిరాశే మిగిలింది. కాగా, మ్యాచ్ అనంతరం తమ జట్టు ప్రదర్శన గురించి రషీద్ ఖాన్ మాట్లాడాడు. ఇది ఆరంభం మాత్రమే అని, సెమీస్‌కు చేరడమే తమ తర్వాతి లక్ష్యమని తెలిపాడు.
అలాగే భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో తమ జట్టులో మార్పులు చేయడానికి, ఇవాళ ఆస్ట్రేలియాతో గత టీమ్ కాంబినేషన్‌ను కొనసాగించడానికి గల కారణాలు రషీద్ ఖాన్ వివరించాడు.''ఆస్ట్రేలియాపై విజయం మా జట్టుకు, దేశానికి ఎంతో గొప్ప ఘనత. ఆసీస్‌పై గెలవడం మంచి అనుభూతి. 2023 వన్డే వరల్డ్ కప్, 2022 టీ20 వరల్డ్ కప్‌లోనే దీన్ని పొందాల్సింది. గుర్బాజ్-ఇబ్రహీం ఓపెనింగ్ జోడీని తుదిజట్టులో కొనసాగించడం మాకు ఎంతో కీలకం. అలాగే ప్రత్యర్థిని బట్టి కూడా ప్లేయింగ్ 11 ఉంటుంది. అందుకే భారత్ మ్యాచ్‌లో భిన్నంగా తుదిజట్టు కూర్పుతో ఆడాం''
''ఈ పిచ్‌పై 140 మంచి స్కోరు. అయితే మేం గొప్పగా బ్యాటింగ్‌ను ముగించలేకపోయాం. దక్కిన శుభారంభంతో ఆ స్కోరు సాధించగలిగాం. ప్రశాంతతో ఉంటే లక్ష్యాన్ని కాపాడుకోగలమని తెలుసు. గుల్బాదిన్ నైబ్ గొప్పగా బౌలింగ్ చేశాడు. మా జట్టులో ఎక్కువ ఆల్‌రౌండర్లు ఉండటం గొప్ప విషయం. అతని అనుభవంతో చక్కగా బౌలింగ్ చేశాడు. ఇవాళ అది మాకు ఎంతో సాయం చేసింది. అతను డేవిడ్ వార్నర్ వికెట్‌ను తీసిన తీరు ఎంతో ఆకట్టుకుంది'' అని రషీద్ ఖాన్ పేర్కొన్నాడు. టీమిండియాతో జరిగిన పోరులో గుర్బాజ్‌తో పాటు ఓపెనర్‌గా హజర్తుల్లా వచ్చాడు. ఇబ్రహీం వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు.