టీ20 వరల్డ్ కప్‌లో స్వల్ప స్కోరుల ఉత్కంఠ భరిత మ్యాచ్‌లు కొనసాగుతున్నాయి. సోమవారం నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన దక్షిణాఫ్రికా-బంగ్లాదేశ్ పోరులో కూడా తక్కువ స్కోరులే నమోదయ్యాయి. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అయితే 'డెడ్ బాల్ రూల్' దక్షిణాఫ్రికాకు వరంగా బంగ్లాకు శాపంగా మారింది.
అసలేం జరిగిందంటే.. మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. హెన్రిచ్ క్లాసెన్ (46; 44 బంతుల్లో, 2 ఫోర్లు, 3 సిక్సర్లు) టాప్ స్కోరర్. తంజీమ్ హసన్ షకీబ్ (3/18) మూడు, తస్కిన్ అహ్మద్ (2/19) రెండు వికెట్లతో సత్తాచాటారు. అనంతరం ఛేదనలో బంగ్లాదేశ్ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 109 పరుగులకే పరిమితమైంది. తౌహిద్ హృదోయ్ (37; 34 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) పోరాడాడు. కేశవ్ మహరాజ్ (3/27) మూడు, నోకియా (2/17), రబాడ (2/19) రెండు వికెట్లతో రాణించారు.

మ్యాచ్‌ను మార్చేసిన 16.2 బాల్
అయితే ఛేదనలో బంగ్లాదేశ్ 50 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో బ్యాటింగ్‌కు వచ్చిన తౌహిద్ హృదోయ్.. మహ్మదుల్లా (20; 27 బంతుల్లో, 2 ఫోర్లు)తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. దీంతో బంగ్లా విజయం సమీకరణం చివరి నాలుగు ఓవర్లలో 27 పరుగులు మారింది. కాగా, బార్టమన్ వేసిన 17వ ఓవర్ రెండో బంతిని తౌహిద్ షాట్‌కు యత్నించగా అది ప్యాడ్లకు తగిలి ఫైన్ లెగ్ మీదుగా బౌండరీకి వెళ్లింది. సౌతాఫ్రికా ఎల్బీడబ్ల్యూగా అపీల్ చేయగా అంపైర్ ఔట్ ఇచ్చాడు.
అనంతరం తౌహిద్ రివ్యూకి వెళ్లాడు. సమీక్షలో నాటౌట్ అని తేలింది. కానీ బంగ్లా స్కోరు బోర్డులో నాలుగు పరుగులు జత కాలేదు. దానికి కారణం ఏంటంటే.. అంపైర్ తొలుత ఎల్బీడబ్ల్యూగా ఔట్ ఇచ్చి, ఆ తర్వాత రివ్యూలో నాటౌట్ అని తేలితే, దాన్ని డెడ్ బాల్‌గా పరిగణిస్తారు. బ్యాటింగ్ చేసే జట్టుకు ఎలాంటి స్కోరు ఇవ్వరు. ఉదాహరణకు.. ప్యాడ్లకు బంతి తగిలిన తర్వాత ఓ బ్యాటర్ సింగిల్ తీశాడు. ఈ లోపు అంపైర్ ఔట్‌గా ప్రకటించాడు. అనంతరం బ్యాటర్ రివ్యూకి వెళ్లి నాటౌట్ అని తేలినా ఆ ఒక్క పరుగు స్కోరుబోర్డులో నమోదు కాదు.
అంతేగాక ఆ బంతిని కూడా కౌంట్ చేస్తారు. ఇలాంటి సందర్భాల్లో బ్యాటింగ్ చేసే జట్టుకు నష్టం వాటిల్లుతుంటుంది. సరిగ్గా దక్షిణాఫ్రికా మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌కు అదే పరిస్థితి ఎదురైంది. అంపైర్ ఔట్ అని ప్రకటించడంతో లెగ్ బై రూపంలో రావాల్సిన నాలుగు పరుగులను బంగ్లా కోల్పోయింది. ఈ మ్యాచ్‌లో అంతిమంగా బంగ్లాదేశ్ నాలుగు పరుగుల తేడాతోనే ఓటమిపాలవ్వడం గమనార్హం. కాగా, తౌహిద్ కాసేపటికే అంపైర్ కాల్‌తో రబాడ బౌలింగ్‌లో ఔటవ్వడం బంగ్లా కొంపముంచింది. మొత్తంగా బంగ్లా టెగర్లు దురుదృష్టవశాత్తు మ్యాచ్‌ను కోల్పోయారు.