టీ20 వరల్డ్ కప్-2024లో ఆస్ట్రేలియా జోరు మీద ఉంది. గ్రూప్-బీలో హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8కు దూసుకెళ్లింది. ఆంటిగ్వా వేదికగా బుధవారం జరిగిన మ్యాచ్‌లో పసికూన నమీబియాపై చెలరేగింది. మొదట బంతితో తర్వాత బ్యాటుతో ప్రత్యర్థి జట్టును వణికించి తొమ్మిది వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆడమ్ జంపా (4/12) ధాటికి నమీబియా 17 ఓవర్లలో 72 పరుగులకు ఆలౌటైంది. గెర్హార్డ్ ఎరాస్మస్ (36; 43 బంతుల్లో, 4 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్.
అనంతరం ఆస్ట్రేలియా 5.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ట్రావిస్ హెడ్ (34 నాటౌట్; 17 బంతుల్లో, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (20; 8 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), మిచెల్ మార్ష్ (18 నాటౌట్, 9 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) నమీబియా బౌలర్లపై విరుచుకుపడ్డారు. డేవిడ్ వైసీ ఒక వికెట్ తీశాడు. స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ మొదటి బంతికే వార్నర్ వికెట్ కోల్పోయే ప్రమాదంలో పడింది. రూబెన్ వేసిన బంతిని వార్నర్ సింగిల్‌కు యత్నించాడు. ఫీల్డర్ నేరుగా వికెట్లకు బంతిని వేస్తే రనౌటయ్యేవాడు. కానీ వార్నర్ తప్పించుకున్నాడు.

తొలి ఓవర్‌లో ఒకే బౌండరీ సాధించిన వార్నర్ రెండో ఓవర్‌లో చెలరేగాడు. డేవిడ్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదాడు. అయితే నాలుగో బంతిని బౌండరీకి యత్నించి వార్నర్ పెవిలియన్‌కు చేరాడు. ఆ తర్వాత బాదే బాధ్యతను హెడ్ తీసుకున్నాడు. మూడో ఓవర్‌లో హెడ్ రెండు ఫోర్లు, ఒక సిక్సర్, మార్ష్ ఓ ఫోర్ బాదడంతో ఏకంగా 19 పరుగులు వచ్చాయి. ఆ తర్వాత అదే జోరును కొనసాగించి 5.4 ఓవర్లలోనే హెడ్, మార్ష్ మ్యాచ్‌ను ముగించారు.
అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన నమీబియా 72 పరుగులు అయినా చేసిందంటే కెప్టెన్ గెర్హార్డ్ పోరాట ఫలితమే. ఆసీస్ బౌలర్ల ధాటికి నమీబియా ఆది నుంచే క్రమంగా వికెట్లు కోల్పోయింది. 43 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయింది. దీంతో పసికూన ఆలౌటవ్వడానికి ఎక్కువ సమయం పట్టదని భావించారంతా. కానీ గెర్హార్డ్ గొప్పగా పోరాడాడు. ఒక్కో పరుగు జత చేస్తూ స్కోరుబోర్డు ముందుకు నడిపించాడు. పోరాడే స్కోరు కాకపోయినా గౌరవప్రదమైన స్కోరును జట్టుకు అందించాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా నాలుగు, హేజిల్‌వుడ్, స్టొయినిస్ చెరో రెండు, కమిన్స్, నాథన్ ఎలిస్ తలో వికెట్ తీశారు.