టీ20 వరల్డ్ కప్‌లో ఆతిథ్య జట్టు వెస్టిండీస్ కథ ముగిసింది. సెమీఫైనల్స్‌కు అర్హత సాధించాలంటే తప్పక గెలవాల్సిన కీలక మ్యాచ్‌లో తడబడింది. ఆంటిగ్వా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో మూడు వికెట్ల తేడాతో ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించింది. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది.
రోస్టన్ ఛేజ్ (52; 42 బంతుల్లో, 3 ఫోర్లు, రెండు సిక్సర్) అర్ధశతకం సాధించాడు. షంసీ (3/27) మూడు వికెట్లతో సత్తాచాటాడు. అయితే ఓ దశలో వెస్టిండీస్ 12 ఓవర్లకు 86/2తో మెరుగైన స్థితిలో ఉంది. కానీ క్రమంగా వికెట్లు కోల్పోయి మోస్తారు స్కోరును సాధించింది. అనంతరం ఛేదనకు దిగిన దక్షిణాఫ్రికా 2 ఓవర్లలో 15/2 స్కోరుతో ఉన్న దశలో వరుణుడు మ్యాచ్‌కు ఆటంకం కలిగించాడు.

ఆలస్యంగా మ్యాచ్ తిరిగి ప్రారంభమవ్వడంతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం సౌతాఫ్రికా లక్ష్యాన్ని 17 ఓవర్లకు 124 పరుగులుగా కుదించారు. కాగా, ఛేదనలో సఫారీ సేన 16.1 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి విజయం సాధించింది. ట్రిస్టన్ స్టబ్స్ (29; 27 బంతుల్లో, 4 ఫోర్లు) టాప్ స్కోరర్. హెన్రిచ్ క్లాసెన్ (22; 10 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్), మార్కో జేన్సన్ (21 నాటౌట్; 14 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) విజయంలో కీలకపాత్ర పోషించారు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ (3/12) మూడు వికెట్లు, రసెల్ (2/19), అల్జారీ జోసెఫ్ (2/25) చెరో రెండు వికెట్లు తీశారు.
కాగా, మ్యాచ్ అనంతరం ఓటమికి గల కారణాలు వెస్టిండీస్ కెప్టెన్ రోవ్‌మన్ పావెల్ వివరించాడు. కీలక పోరులో బ్యాటర్లు విఫలమవ్వడంతో టోర్నీ నుంచి వైదొలగాల్సి వచ్చిందని పేర్కొన్నాడు. అయితే సెమీఫైనల్స్‌కు అర్హత సాధించనప్పటికీ తమ బౌలర్ల పోరాటంపై ఎంతో గర్వపడుతున్నాని తెలిపాడు. బోర్డుపై ఆ స్కోరు సరిపోదని తెలిసి కూడా, ఆఖరి ఓవర్‌కు మ్యాచ్‌ను తీసుకెళ్లారని కొనియాడాడు.
''ఆఖరి వరకు పోరాడిన మా ఆటగాళ్లకు క్రెడిట్ ఇవ్వాలి. బ్యాటింగ్ గ్రూప్‌గా ఇవాళ ప్రదర్శనను మేం మరిచిపోవాలి. మిడిల్ ఓవర్లలో పేలవంగా ఆడాం. కీలక సమయాల్లో వికెట్లు కోల్పోయాం. దీంతో తిరిగి జోరు అందుకోవడానికి సమయం పట్టింది. అయితే బౌలర్లు గొప్పగా పోరాడారు. 135 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకుంటామని నమ్మారు. మేం ఈ వరల్డ్ కప్ గెలవనప్పటీకీ, సెమీఫైనల్‌కు చేరనప్పటికీ గత 12 నెలలుగా గొప్ప క్రికెట్ ఆడాం. తిరిగి వెస్టిండీస్‌కు మద్దతుదారులను సంపాదించుకున్నాం'' అని పావెల్ అన్నాడు.