T20 World Cup 2026: ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 వరల్డ్ కప్‌కు ముందు క్రికెట్ ప్రపంచంలో వింత పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ టోర్నీ నుంచి బంగ్లాదేశ్ తప్పుకోగా.. పాకిస్థాన్ కూడా బహిష్కరించే యోచనలో ఉంది. ఈ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని కొన్ని చిన్న దేశాల క్రికెట్ బోర్డులు పాకిస్థాన్‌పై ఓ రేంజ్‌లో జోకులు పేలుస్తున్నాయి. తాజాగా ఐస్లాండ్ క్రికెట్ తర్వాత ఉగాండా క్రికెట్ టీమ్ కూడా ఈ సోషల్ మీడియా 'ట్రోలింగ్'లో చేరిపోయింది.
మా పాస్‌పోర్టులు రెడీ.. ఉగాండా అదిరిపోయే పోస్ట్!
పాకిస్థాన్ స్థానంలో తాము ఆడతామంటూ ఉగాండా క్రికెట్ అసోసియేషన్ తమ అధికారిక 'ఎక్స్' (ట్విట్టర్) ఖాతాలో ఒక ఫన్నీ పోస్ట్ పెట్టింది. "టీ20 ప్రపంచకప్‌లో ఏదైనా సీటు ఖాళీగా ఉంటే చెప్పండి.. ఉగాండా సిద్ధంగా ఉంది. మా పాస్‌పోర్టులు కూడా రెడీగా ఉన్నాయి. ఎండైనా, శబ్దమైనా, ఒత్తిడైనా.. మేము మా సత్తా చాటడానికి సిద్ధం" అంటూ ఉగాండా సరదాగా వ్యాఖ్యానించింది.

ముందు ఐస్‌లాండ్.. ఇప్పుడు ఉగాండా!
పాకిస్థాన్‌ను ఎగతాళి చేయడంలో ఉగాండా కంటే ముందు ఐస్‌లాండ్ క్రికెట్ ముందుంది. మొదట పాకిస్థాన్ స్థానంలో ఆడతామని చెప్పిన ఐస్‌లాండ్, తర్వాత యూ-టర్న్ తీసుకుంది. "మా ఆటగాళ్లంతా పార్ట్ టైమ్ క్రికెటర్లే. వారు ఆఫీసులకు సెలవు పెట్టి రాలేరు. పైగా కొలంబోకు విమాన టికెట్లు చాలా ఖరీదుగా ఉన్నాయి" అంటూ ఐస్‌లాండ్ సెటైర్లు వేసింది. "మా నష్టం ఉగాండాకు లాభం కావొచ్చు" అని ఐస్‌లాండ్ చేసిన కామెంట్స్‌కు స్పందనగానే ఉగాండా తాజా పోస్ట్ పెట్టింది.
అసలు పాక్ ఎందుకు వెనకాడుతోంది?
భారత్‌లో తమకు భద్రత లేదని.. తమ మ్యాచులను శ్రీలంకకు మార్చాలని ఐసీసీని కోరిన బంగ్లాదేశ్ విజ్ఞప్తిని ఐసీసీ తిరస్కరించింది. దీంతో బంగ్లాదేశ్ టోర్నీని బహిష్కరించింది. ఇప్పుడు బంగ్లాదేశ్‌కు మద్దతుగా పాకిస్థాన్ కూడా వరల్డ్ కప్ నుంచి తప్పుకోవాలని భావిస్తోంది. అయితే ఐసీసీ నుంచి వచ్చే భారీ జరిమానాలు, భవిష్యత్తుపై పడే ప్రభావం వల్ల పీసీబీ ఇంకా సందిగ్ధంలోనే ఉంది.