T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 ఉత్కంఠభరితమైన రెండో దశకు చేరుకుంది. మొత్తం 20 జట్లతో మొదలైన ఈ మెగా టోర్నీలో ఇప్పుడు కేవలం 8 జట్లు మాత్రమే మిగిలాయి. ఫిబ్రవరి 21 నుంచి సూపర్-8 పోరు ప్రారంభం కానుంది. అయితే ఈ సూపర్-8కు చేరిన జట్లలో నాలుగు జట్లు మాత్రం గ్రూప్ స్టేజ్‌లో ఆడిన అన్ని మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించి అజేయంగా నిలిచాయి. ముఖ్యంగా ఈ జాబితాలో ఉన్న మూడో జట్టు గురించి ఎవరూ కనీసం ఊహించలేదు.
'గ్రూప్ ఆఫ్ డెత్'లో అసలైన వేట
సూపర్-8లో గ్రూప్-1ను విశ్లేషకులు 'గ్రూప్ ఆఫ్ డెత్' అని పిలుస్తున్నారు. ఇందులో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. విశేషం ఏంటంటే, ఈ నాలుగు జట్లు గ్రూప్ దశలో ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. ఇప్పుడు ఇవన్నీ ఒకే గ్రూప్‌లో ఉండటంతో, కేవలం రెండు జట్లు మాత్రమే సెమీఫైనల్‌కు వెళ్లే అవకాశం ఉంది. ఇక్కడ ఒక చిన్న పొరపాటు చేసినా టోర్నీ నుండి నిష్క్రమించాల్సిందే.

1. భారత్: డిఫెండింగ్ ఛాంపియన్ జోరు
ఆతిథ్య భారత్ గ్రూప్ దశలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పాకిస్థాన్, నమీబియా, నెదర్లాండ్స్‌పై ఘనవిజయాలు సాధించడమే కాకుండా, అమెరికాతో జరిగిన ఉత్కంఠభరిత పోరులోనూ విజయం అందుకుంది. సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో టీమిండియా బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అనే మూడు విభాగాల్లోనూ సమతుల్యంగా కనిపిస్తోంది.
2. దక్షిణాఫ్రికా: నిలకడైన ప్రదర్శన
గత ఎడిషన్‌లో రన్నరప్‌గా నిలిచిన దక్షిణాఫ్రికా.. ఈసారి కూడా టైటిల్ వేటలో బలంగా ఉంది. గ్రూప్-డీలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన ప్రోటీస్ జట్టు.. భారత్ తర్వాత అత్యుత్తమ నెట్ రన్ రేట్ కలిగి ఉంది. వారి బౌలింగ్ విభాగం ప్రత్యర్థులను వణికిస్తోంది. ముఖ్యమైన మ్యాచ్‌ల్లో ఒత్తిడికి లోనవ్వకుండా ఉంటే ఈసారి వారు కప్పు కొట్టడం ఖాయం.
3. జింబాబ్వే: అందరినీ ఆశ్చర్యపరిచిన 'జెయింట్ కిల్లర్'
ఈ టోర్నీలో అతిపెద్ద సంచలనం ఎవరంటే అది నిస్సందేహంగా జింబాబ్వేనే. గ్రూప్ దశలో ఆస్ట్రేలియా, శ్రీలంక వంటి మాజీ ఛాంపియన్లను మట్టికరిపించి అజేయంగా నిలిచింది. జింబాబ్వే ఇలాంటి ప్రదర్శన చేస్తుందని ఎవరూ కలలో కూడా ఊహించలేదు. ఇప్పుడు సూపర్-8లో భారత్, దక్షణాఫ్రికా వంటి జట్లకు కూడా వీరు గట్టి పోటీనిచ్చేలా కనిపిస్తున్నారు.
4. వెస్టిండీస్: కరీబియన్ల పవర్‌హిట్టింగ్
వెస్టిండీస్ జట్టు మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తోంది. తమ పవర్‌హిట్టింగ్‌తో గ్రూప్ స్టేజ్‌లో ప్రత్యర్థులను చిత్తు చేశారు. 2016 ప్రపంచకప్‌లో భారత్‌కు ఇచ్చిన షాక్ ఇప్పటికీ అభిమానుల కళ్లముందే ఉంది. ఇప్పుడు మళ్లీ అదే గ్రూప్‌లో ఉండటంతో విండీస్ జట్టంటే టీమిండయాకు ప్రధాన ముప్పుగా మారింది. అజేయంగా నిలిచిన ఈ నాలుగు జట్ల మధ్య సూపర్-8 పోరు రణరంగాన్ని తలపించనుంది. ఇందులో ఎవరు సెమీస్ చేరుతారో చూడాలి!