టీ20 ప్రపంచ కప్ 2026 సమరం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. గత కొన్ని రోజులుగా జరిగిన గ్రూప్ దశ మ్యాచులు ముగియడంతో టోర్నమెంట్లో పాల్గొన్న 20 జట్లలో 12 జట్లు నిష్క్రమించాయి. ఇప్పుడు మిగిలిన 8 జట్లు టైటిల్ పోరు కోసం సిద్ధమయ్యాయి. నేటి(ఫిబ్రవరి 21) నుంచి సూపర్-8 పోరాటం ప్రారంభం కానుంది. ఈ దశలో మొత్తం 9 రోజుల పాటు 12 హై-వోల్టేజ్ మ్యాచులు జరగనున్నాయి. ఈ మ్యాచ్‌లలో గెలిచిన టాప్ జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి.
అనూహ్య మార్పులు.. ఆస్ట్రేలియా అవుట్!
ఈసారి సూపర్-8 సమీకరణాలు అందరినీ ఆశ్చర్యపరిచాయి. ఐసీసీ ముందుగా అంచనా వేసిన 8 జట్లలో ఏడు జట్లు తమ స్థానాలను నిలబెట్టుకోగా.. బలమైన ఆస్ట్రేలియా జట్టు మాత్రం సూపర్-8 రేసు నుంచి తప్పుకుంది. ఆస్ట్రేలియా స్థానంలో జింబాబ్వే అద్భుత ప్రదర్శనతో ఈ జాబితాలో చేరింది. ప్రస్తుతం గ్రూప్-1లో భారత్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, జింబాబ్వే ఉన్నాయి. గ్రూప్-2లో పాకిస్థాన్, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆతిథ్య శ్రీలంక జట్లు తలపడనున్నాయి.

టీమిండియా షెడ్యూల్
సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు తన సూపర్-8 ప్రయాణాన్ని ఆదివారం (ఫిబ్రవరి 22) అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో ప్రారంభించనుంది. గత ప్రపంచ కప్ ఫైనలిస్టుల మధ్య జరగనున్న ఈ మ్యాచ్ ప్రేక్షకులకు కనువిందు చేయనుంది. ఆ తర్వాత ఫిబ్రవరి 26న చెన్నైలో జింబాబ్వేతో, మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో భారత్ తలపడుతుంది. భారత జట్టు సెమీస్ చేరాలంటే కనీసం రెండు మ్యాచ్‌లలో విజయం సాధించడం అత్యవసరం.
వేదికలు, సెమీఫైనల్ రేసు
ఈ సూపర్-8 మ్యాచులు భారత్, శ్రీలంకలోని ప్రముఖ స్టేడియాలలో జరగనున్నాయి. కొలంబోలోని ప్రేమదాస స్టేడియం, పల్లెకెలె, అహ్మదాబాద్, ముంబై, చెన్నై మైదానాలు ఈ కీలక పోరుకు ఆతిథ్యమిస్తున్నాయి. సూపర్-8 ముగిసిన తర్వాత, రెండు గ్రూపుల నుంచి టాప్-2లో నిలిచిన నాలుగు జట్లు సెమీఫైనల్‌కు చేరుకుంటాయి. మార్చి 4, 5 తేదీల్లో సెమీఫైనల్స్ నిర్వహించి, మార్చి 8న గ్రాండ్ ఫైనల్ ద్వారా ప్రపంచ విజేత ఎవరో తేలిపోనుంది.
సూపర్-8 పూర్తి షెడ్యూల్ :
ఫిబ్రవరి 21: న్యూజిలాండ్ vs పాకిస్థాన్ (కొలంబో, రాత్రి 7:00)
ఫిబ్రవరి 22: ఇంగ్లాండ్ vs శ్రీలంక (పల్లెకెలె,మధ్యాహ్నం 3:00) & భారత్ vs సౌతాఫ్రికా (అహ్మదాబాద్, రాత్రి 7:00)
ఫిబ్రవరి 23: జింబాబ్వే vs వెస్టిండీస్ (ముంబై, రాత్రి 7:00)
ఫిబ్రవరి 24: ఇంగ్లాండ్ vs పాకిస్థాన్ (పల్లెకెలె, రాత్రి 7:00)
ఫిబ్రవరి 25: న్యూజిలాండ్ vs శ్రీలంక (కొలంబో, రాత్రి 7:00)
ఫిబ్రవరి 26: సౌతాఫ్రికా vs వెస్టిండీస్ (అహ్మదాబాద్, మధ్యాహ్నం 3:00) & భారత్ vs జింబాబ్వే (చెన్నై, రాత్రి 7:00)
ఫిబ్రవరి 27: ఇంగ్లాండ్ vs న్యూజిలాండ్ (కొలంబో, రాత్రి 7:00)
ఫిబ్రవరి 28: పాకిస్థాన్ vs శ్రీలంక (పల్లెకెలె, రాత్రి 7:00)
మార్చి 1: జింబాబ్వే vs సౌతాఫ్రికా (ఢిల్లీ, మధ్యాహ్నం 3:00) & భారత్ vs వెస్టిండీస్ ( కోల్‌కతా, రాత్రి 7:00)