T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్‌లో భారత్ తరఫున సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడిగా ఇప్పటికీ సురేష్ రైనా పేరిట రికార్డు ఉంది. అయితే ఈ ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియా స్టార్ బ్యాటర్లు సూర్యకుమార్ యాదవ్, అభిషేక్ శర్మ కాకుండా.. మరో ఆటగాడు ఈ మెగా టోర్నీలో సెంచరీ సాధిస్తాడని రైనా జోస్యం చెప్పాడు. ఆ రికార్డును కేరళ స్టార్ బ్యాటర్ సంజూ శాంసన్ సమం చేస్తాడని రైనా ధీమా వ్యక్తం చేశాడు.
ఫామ్ కోల్పోయినా సంజూకు అండగా రైనా!
ప్రస్తుతం సంజూ శాంసన్ గడ్డు కాలాన్ని ఎదుర్కొంటున్నాడు. శుభ్‌మన్ గిల్ జట్టులో లేని సమయంలో ఓపెనర్‌గా వచ్చిన శాంసన్, న్యూజిలాండ్‌తో జరుగుతున్న సిరీస్‌లో ఆశించిన రీతిలో రాణించలేకపోయాడు. గత నాలుగు ఇన్నింగ్స్‌ల్లో సంజూ శాంసన్ 10, 6, 0, 24 పరుగులు మాత్రమే చేశాడు. అయినప్పటికీ సురేష్ రైనా మాత్రం సంజూ శాంసన్ సత్తాపై నమ్మకం ఉంచడం గమనార్హం."సంజూ శాంసన్ కచ్చితంగా సెంచరీ సాధించే ఆటగాళ్ల జాబితాలో ఉంటాడు. ఆయన ఓపెనర్‌గా వస్తున్నాడు కాబట్టి సెంచరీ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే దక్షిణాఫ్రికాలో రెండు సెంచరీలు బాదాడు. అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ పోటీలో ఉన్నప్పటికీ, ఈ వరల్డ్ కప్‌లో సంజూనే సెంచరీ కొడతాడని నేను నమ్ముతున్నాను." అని టీమిండియా లెజెండ్ సురేష్ రైనా పేర్కొన్నాడు.

సూర్యకుమార్‌తో పోలిక
2025లో ఫామ్ కోల్పోయిన సూర్యకుమార్ యాదవ్‌కు జట్టు యాజమాన్యం ఎలాగైతే అండగా నిలిచిందో, సంజూ శాంసన్‌కు కూడా అలాగే మద్దతు ఇవ్వాలని సురేష్ రైనా కోరాడు. "ఫామ్ అనేది తాత్కాలికం, క్లాస్ శాశ్వతం. సూర్యకుమార్ ఏడాది పాటు పరుగులు చేయకపోయినా కోచ్ ఆయనకు మద్దతు ఇచ్చారు. సంజూ శాంసన్ విషయంలోనూ అదే జరగాలి" అని రైనా అన్నాడు.
నంబర్ 1 బ్యాటర్‌తో కలిసి ఓపెనింగ్
ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న 20 జట్ల టీ20 ప్రపంచకప్‌లో సంజూ శాంసన్ చోటు దక్కించుకున్నాడు. ప్రపంచ నంబర్ 1 టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మతో కలిసి ఆయన ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. ఇప్పటివరకు 55 అంతర్జాతీయ టీ20ల్లో మూడు సెంచరీలు సాధించిన సంజూ శాంసన్, వరల్డ్ కప్‌లో సురేష్ రైనా సరసన నిలుస్తాడో లేదో చూడాలి.