T20 World Cup 2026: శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్‌లో వాతావరణం అనూహ్య మలుపులు తిప్పుతోంది. ఓ జట్టుకు శాపంగా మారిన వర్షం.. మరో జట్టుకు అదృష్టాన్ని మోసుకొచ్చేలా కనిపిస్తోంది. గ్రూప్-బీలో పటిష్టమైన జట్టుగా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను వర్షం కోలుకోలేని దెబ్బతీసింది. మంగళవారం జింబాబ్వే, ఐర్లాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ ఫలితంపై ఆస్ట్రేలియా ఎన్నో ఆశలు పెట్టుకుంది. అయితే వర్షం కారణంగా ఆ మ్యాచ్ ఒక్క బంతి పడకుండానే రద్దు కావడంతో జింబాబ్వేకు ఓ పాయింట్ లభించింది. దీనివల్ల జింబాబ్వే 5 పాయింట్లతో ముందంజ వేయగా.. ఆస్ట్రేలియా గరిష్టంగా సాధించగలిగే పాయింట్లు 4 మాత్రమే కావడంతో మాజీ ఛాంపియన్లు టోర్నీ నుంచినిష్క్రమించాల్సి వచ్చింది. 2009 తర్వాత ఆస్ట్రేలియా ఇంత త్వరగా ఇంటిముఖం పట్టడం ఇదే తొలిసారి.
పాకిస్థాన్‌కు వరంగా వాతావరణం
ఆస్ట్రేలియా విషయంలో విలన్‌గా మారిన వర్షం, ఇప్పుడు గ్రూప్-ఏలో ఉన్న పాకిస్థాన్ పాలిట 'హీరో'గా మారే అవకాశం ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్, అమెరికా రెండూ చెరో 4 పాయింట్లతో ఉన్నాయి. అయితే అమెరికా తన గ్రూప్ దశ మ్యాచ్‌లను పూర్తి చేసుకోగా.. పాకిస్థాన్‌కు నేడు నమీబియాతో ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఒకవేళ కొలంబోలో వర్షం కారణంగా ఈ మ్యాచ్ రద్దయితే, పాకిస్థాన్‌కు లభించే 1 పాయింట్ వారిని 5 పాయింట్లకు చేరుస్తుంది. తద్వారా ఎలాంటి కష్టం లేకుండానే అమెరికాను వెనక్కి నెట్టి పాక్ సూపర్-8కు అర్హత సాధిస్తుంది.

కొలంబో వాతావరణం
నేడు కొలంబోలోని ఎస్‌ఎస్‌సీ (SSC) స్టేడియంలో వాతావరణం మ్యాచ్ నిర్వహణకు అనుకూలంగా లేదు. వాతావరణ శాఖ నివేదికల ప్రకారం..మధ్యాహ్నం వేళ ఉరుములతో కూడిన భారీ వర్షం పడే అవకాశం 60-70 శాతం వరకు ఉంది. ఒకవేళ వర్షం తగ్గినా, తడి అవుట్‌ఫీల్డ్ కారణంగా మ్యాచ్ ఆలస్యమయ్యే లేదా ఓవర్లు తగ్గించే అవకాశం ఉంది. పూర్తిగా మ్యాచ్ రద్దయితే పాకిస్థాన్ నేరుగా తదుపరి దశకు వెళ్తుంది.
అమెరికా ఆశలు.. నమీబియా సవాల్
పాకిస్థాన్ అభిమానులు వర్షం కోసం ఎదురుచూస్తుంటే, అమెరికా మాత్రం మ్యాచ్ జరగాలని, అందులో నమీబియా సంచలనం సృష్టించాలని కోరుకుంటోంది. ఒకవేళ వర్షం పడకుండా మ్యాచ్ జరిగి, అందులో నమీబియా పాకిస్థాన్‌ను ఓడిస్తే మాత్రం అమెరికా చరిత్ర సృష్టిస్తూ సూపర్-8కు చేరుకుంటుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆట కంటే వాతావరణమే జట్ల తలరాతలను నిర్ణయించేలా కనిపిస్తోంది.