T20 World Cup 2026: ప్రస్తుతం క్రికెట్ ప్రపంచం అంతా భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న టీ20 ప్రపంచ కప్ 2026 ఫీవర్‌తో ఊగిపోతోంది. ఈ మెగా టోర్నీలో భారత్ తరఫున ఆడుతున్న ఆటగాళ్లే కాకుండా ఇతర దేశాల జట్లలోనూ భారత సంతతికి చెందిన క్రీడాకారులు తమ ప్రతిభను చాటుకుంటున్నారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ'మన్ కీ బాత్' ప్రసంగంలో ఈ విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇతర దేశాల జట్లలో ఆడుతున్న భారత సంతతి ఆటగాళ్లపై ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు.
మన జెండా.. వారి జర్నీ!
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. "ఎవరైతే ఆడతారో వారే వికసిస్తారు. క్రీడలు మనల్ని ఏకం చేస్తాయి. ప్రస్తుతం మీరు టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లు చూస్తూ ఉండవచ్చు. ఏదైనా మ్యాచ్ చూస్తున్నప్పుడు మీ కళ్లు ఒక ప్రత్యేక ఆటగాడిపై నిలిచిపోవచ్చు. వారు వేసుకున్న జెర్సీ మరో దేశానికి చెందినది కావచ్చు, కానీ వారి పేరు వినగానే మన దేశానికి చెందిన వ్యక్తి అనిపిస్తుంది. ఆ సమయంలో మన హృదయం ఎంతో గర్వంతో నిండిపోతుంది" అని అన్నారు. భారత సంతతికి చెందిన ఆటగాళ్లు తాము నివసిస్తున్న దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తూ తమ మూలాలను మర్చిపోకుండా అద్భుతంగా రాణిస్తున్నారని ఆయన కొనియాడారు.

కెనడా, అమెరికా జట్లలో మనోళ్లే ఎక్కువ!
ముఖ్యంగా కెనడా, అమెరికా జట్లలో భారత మూలాలున్న ఆటగాళ్లు అధికంగా ఉన్నారని ప్రధాని గుర్తు చేశారు. కెనడా కెప్టెన్ దిల్‌ప్రీత్ బజ్వా పంజాబ్‌లోని గుర్దాస్‌పూర్‌లో జన్మించారు. నవనీత్ ధలివాల్ చండీగఢ్‌కు చెందినవారు. హర్ష్ ఠాకర్, శ్రేయాస్ మోవా వంటి వారు కెనడా తరఫున ఆడుతూ భారత్ కీర్తిని పెంచుతున్నారు. అమెరికా కెప్టెన్ మోనాంక్ పటేల్ గతంలో గుజరాత్ అండర్-16, అండర్-18 జట్లకు ఆడారు. సౌరభ్ (ముంబై), హర్మీత్ సింగ్, మిలింద్ కుమార్ (ఢిల్లీ) వంటి వారు అమెరికా జట్టులో కీలక సభ్యులుగా ఉన్నారు.
ఒమన్ నుంచి ఇటలీ వరకు..
కేవలం అగ్ర దేశాలే కాకుండా ఒమన్, న్యూజిలాండ్, యూఏఈ, ఇటలీ వంటి జట్లలో కూడా భారత సంతతి ఆటగాళ్లు రాణిస్తున్నారని ప్రధాని వెల్లడించారు. ఒమన్ జట్టులోని జతిందర్ సింగ్, వినాయక్ శుక్లా, కరణ్, జై, ఆశిష్ వంటి వారు భారత దేశవాళీ క్రికెట్ నుంచి వచ్చిన వారేనని పేర్కొన్నారు. "భారతీయులు ఎక్కడికి వెళ్లినా తమ మాతృభూమి మూలాలతో ముడిపడి ఉంటారు. అలాగే తాము ఉంటున్న దేశాభివృద్ధిలో కూడా కీలక పాత్ర పోషిస్తారు. భారతీయత గొప్పతనం ఇదే" అని ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.