T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందే ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్ తగిలింది. ఆసీస్ స్టార్ పేసర్ ప్యాట్ కమిన్స్ గాయం కారణంగా ఈ మెగా టోర్నీ నుంచి పూర్తిగా దూరమయ్యాడు. ప్యాట్ కమిన్స్ గత కొంతకాలంగా వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నాడు. ప్రస్తుతం పాకిస్థాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌కు కూడా ఆయన దూరంగా ఉన్నాడు. ఫిబ్రవరి 7 నాటికి కమిన్స్ కోలుకుంటాడని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఆశించినప్పటికీ.. వైద్య బృందం నివేదిక ప్రకారం కమిన్స్ ఇంకా పూర్తి ఫిట్‌నెస్ సాధించలేదు. ప్రపంచకప్ వంటి కీలక టోర్నీలో రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక, ఆయనకు విశ్రాంతినిస్తూ రిహాబిలిటేషన్‌కు పంపాలని బోర్డు నిర్ణయించింది.
జట్టులోకి కొత్త బౌలర్ ఎంట్రీ
ప్యాట్ కమిన్స్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ఎడమచేతి వాటం ఫాస్ట్ బౌలర్ బెన్ ద్వార్షుయిస్‌ను జట్టులోకి తీసుకున్నారు. బెన్ ద్వార్షుయిస్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో బ్యాటింగ్ కూడా చేయగలడు. అలాగే ఓపెనర్ మాథ్యూ షార్ట్ స్థానంలో మాథ్యూ రెన్షాను జట్టులోకి చేర్చారు. రెన్షా ఇటీవలే పాకిస్థాన్‌పై టీ20 అరంగేట్రం చేసి మంచి ఫామ్‌లో ఉన్నాడు. కమిన్స్ లేకపోవడం కెప్టెన్ మిచెల్ మార్ష్‌కు పెద్ద సవాలే. ఎందుకంటే కమిన్స్ కేవలం బౌలర్ మాత్రమే కాదు, క్లిష్ట పరిస్థితుల్లో జట్టును మానసికంగా బలోపేతం చేయగల అనుభవం ఆయనకు ఉంది.

ఆస్ట్రేలియా టీ20 ప్రపంచకప్ 2026 తుది జట్టు ఇదే:
మిచెల్ మార్ష్ (కెప్టెన్), జేవియర్ బార్ట్లెట్, కూపర్ కాన్లీ, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, కామెరూన్ గ్రీన్, నాథన్ ఎల్లిస్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, జోష్ ఇంగ్లిస్, మాథ్యూ కుహ్నెమన్, గ్లెన్ మాక్స్‌వెల్, మాథ్యూ రెన్షా, మార్కస్ స్టోయినిస్, ఆడమ్ జంపా.