NZ vs ENG: టీ20 ప్రపంచకప్ 2026 ఇప్పుడు అత్యంత కీలక దశకు చేరుకుంది. సూపర్-8 దశలో జట్లు హోరాహోరీగా తలపడుతుండటంతో అభిమానుల్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు తమ అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్ బెర్తులను ఖరారు చేసుకున్నాయి. ఇక మిగిలి ఉన్న రెండు స్థానాల కోసం భారత్, పాకిస్థాన్, వెస్టిండీస్, న్యూజిలాండ్ వంటి దిగ్గజ జట్లు పోటీ పడుతున్నాయి. జింబాబ్వే, శ్రీలంక జట్లు ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించగా.. మిగిలిన జట్ల మధ్య పోరు ఇప్పుడు 'డూ ఆర్ డై' అన్నట్లుగా మారింది.
పాకిస్థాన్ ఆశలు.. న్యూజిలాండ్ చేతుల్లో!
పాకిస్థాన్ జట్టు సెమీఫైనల్ చేరడం అనేది ఇప్పుడు వారి సొంత ప్రదర్శన కంటే ఎక్కువగా ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంది. నేడు (ఫిబ్రవరి 27) న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య జరగనున్న 49వ మ్యాచ్ పాకిస్థాన్ భవితవ్యాన్ని నిర్ణయించనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థితిలో ఉన్న న్యూజిలాండ్ ఈ మ్యాచ్‌లో గెలిస్తే నేరుగా 5 పాయింట్లతో సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. అదే జరిగితే పాకిస్థాన్ అధికారికంగా టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. అందుకే నేడు ఇంగ్లాండ్ జట్టు న్యూజిలాండ్‌ను ఓడించాలని పాక్ అభిమానులు ప్రార్థనలు చేస్తున్నారు.

పాకిస్థాన్ ముందున్న క్లిష్టమైన సవాలు
ఒకవేళ నేటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోతే.. వారు 3 పాయింట్ల వద్దే నిలిచిపోతారు. అప్పుడు మాత్రమే పాకిస్థాన్‌కు సెమీస్ వెళ్లే అవకాశం ఉంటుంది. అయితే ఇది అంత సులభం కాదు. పాకిస్థాన్ తన తదుపరి మ్యాచ్‌లో శ్రీలంకపై తప్పనిసరిగా భారీ తేడాతో విజయం సాధించాలి. కేవలం గెలవడమే కాకుండా.. వారి నెట్ రన్ రేట్ (NRR) న్యూజిలాండ్ కంటే మెరుగ్గా ఉండేలా చూసుకోవాలి. అంటే మొదట బ్యాటింగ్ చేస్తే భారీ స్కోరు సాధించాలి లేదా లక్ష్యాన్ని అతి తక్కువ ఓవర్లలోనే ఛేదించాల్సి ఉంటుంది. ఈ క్లిష్ట సమీకరణాల మధ్య పాక్ సెమీస్ చేరుతుందా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.
గ్రూప్ 1 సమీకరణం: భారత్ వర్సెస్ వెస్టిండీస్
మరోవైపు గ్రూప్ 1లో భారత్ , వెస్టిండీస్ జట్ల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. జింబాబ్వేపై 72 పరుగుల భారీ విజయం తర్వాత భారత్ 2 పాయింట్లతో రేసులో నిలిచింది. వెస్టిండీస్ వద్ద కూడా ప్రస్తుతం 2 పాయింట్లే ఉన్నాయి. ఈ రెండు జట్ల మధ్య మార్చి 1న జరగబోయే మ్యాచ్ ఒక 'వర్చువల్ క్వార్టర్ ఫైనల్'గా మారనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టు 4 పాయింట్లతో నేరుగా సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తుంది. ఓడిన జట్టుకు మరో అవకాశం లేకుండా టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. దక్షిణాఫ్రికా చేతిలో వెస్టిండీస్ ఓడిపోవడం భారత్‌కు కొంత ఊరటనిచ్చినా.. మార్చి 1న జరిగే పోరు మాత్రం ఇరు జట్లకు నిర్ణయాత్మకం కానుంది.