T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 నుంచి బంగ్లాదేశ్ తప్పుకోవడం, వారి స్థానంలో స్కాట్లాండ్ ఎంట్రీ ఇవ్వడం అంతర్జాతీయ క్రికెట్‌లో పెను సంచలనం సృష్టించింది. అయితే ఈ వివాదం సద్దుమణగక ముందే పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) కొత్త డ్రామాకు తెరలేపింది. భారత్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీలో తమ భాగస్వామ్యంపై పీసీబీ ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
శనివారం (జనవరి 24) జరిగిన ప్రెస్ కాన్ఫరెన్స్‌లో మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ.. పాకిస్థాన్ జట్టు ప్రపంచకప్‌లో పాల్గొనాలా వద్దా అనేది పూర్తిగా తమ ప్రభుత్వంపై ఆధారపడి ఉంటుందని స్పష్టం చేశారు. "ఒకవేళ పాకిస్థాన్ ప్రభుత్వం ప్రపంచకప్ ఆడొద్దని చెబితే, ఐసీసీ మా స్థానంలో 22వ జట్టును వెతుక్కోవచ్చు. మా ప్రధాన మంత్రి విదేశీ పర్యటన ముగించుకుని తిరిగి వచ్చిన తర్వాతే దీనిపై స్పష్టత వస్తుంది" అని ఆయన పేర్కొన్నారు.

వాస్తవానికి భద్రతా కారణాల రీత్యా భారత్‌కు రావడానికి పాకిస్థాన్ మొదటి నుంచీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది. బంగ్లాదేశ్ తన మ్యాచ్‌లను హైబ్రిడ్ మోడల్‌లో (మరో దేశంలో) నిర్వహించాలని కోరి విఫలమవ్వడం, ఇప్పుడు ఏకంగా టోర్నీ నుంచే తప్పుకోవడంతో పాకిస్థాన్ కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నట్లు కనిపిస్తోంది. ఒకవేళ పాకిస్థాన్ కూడా తప్పుకుంటే, ఐసీసీ ఆ స్థానంలో జింబాబ్వే లేదా మరో అసోసియేట్ దేశాన్ని ఆహ్వానించే అవకాశం ఉంది.
ఐసీసీ ఇప్పటికే బంగ్లాదేశ్ విషయంలో కఠినంగా వ్యవహరించి స్కాట్లాండ్‌కు అవకాశం ఇచ్చింది. పాకిస్థాన్ కూడా ఇదే మొండివైఖరి ప్రదర్శిస్తే, ఐసీసీ వారిపై కూడా కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత్-పాకిస్థాన్ మ్యాచ్ అంటే ఐసీసీకి వచ్చే భారీ ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని పాకిస్థాన్ ఈ తరహా 'బ్లాక్ మెయిల్' పాలిటిక్స్ చేస్తోందని క్రీడా అభిమానులు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు.