T20 World Cup 2026: రాబోయే ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్‌లో పాకిస్థాన్ పాల్గొంటుందా లేదా? అన్న ఉత్కంఠ ప్రపంచ క్రికెట్లో హాట్ టాపిక్‌గా మారింది. పాకిస్థాన్ టీ20 వరల్డ్ కప్ భాగస్వామ్యంపై సస్పెన్స్ కొనసాగుతున్నప్పటికీ.. ఆ జట్టు కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా కీలక ప్రకటన చేశారు. మైదానం బయట ఎన్ని రాజకీయ, పరిపాలనాపరమైన చర్చలు జరుగుతున్నా.. మైదానంలో మాత్రం తన ప్రణాళికలు సిద్ధంగా ఉన్నాయని పాక్ కెప్టెన్ స్పష్టం చేశారు. మెగా టోర్నీలో తాను ఏ స్థానంలో బ్యాటింగ్‌కు వస్తారో స్పష్టం చేస్తూనే, ఆ నిర్ణయం వెనుక ఉన్న అసలు కారణాన్ని వెల్లడించారు.
నెంబర్ 3 స్థానం లాక్.. ఎందుకంటే?
లాహోర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో విజయం సాధించిన తర్వాత సల్మాన్ అలీ ఆఘా తన బ్యాటింగ్ స్థానంపై కీలక ప్రకటన చేశారు. "అవును, నేను వరల్డ్ కప్‌లో నంబర్ 3 స్థానంలో బ్యాటింగ్ చేస్తాను. టోర్నీలో స్పిన్ ప్రభావం ఎక్కువగా ఉంటుందని మేము భావిస్తున్నాము. పవర్‌ప్లేలో స్పిన్‌ను సమర్థవంతంగా ఎదుర్కొని ఆధిపత్యం చెలాయించగలననే నమ్మకం నాకుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను" అని సల్మాన్ అలీ ఆఘా వెల్లడించారు. సాధారణంగా లోయర్ ఆర్డర్‌లో వచ్చే సల్మాన్, ఆస్ట్రేలియాపై 39 పరుగులతో రాణించి తన నిర్ణయం సరైనదేనని నిరూపించుకున్నారు.

శ్రీలంకకు పయనం.. సస్పెన్స్ వీడినట్టేనా?
ఫిబ్రవరి 7 నుంచి భారత్, శ్రీలంక వేదికలుగా జరగనున్న ఈ టోర్నీ కోసం పాక్ జట్టు ఫిబ్రవరి 2నే కొలంబోకు బయలుదేరనుంది. ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని.. చివరి నిమిషంలో టోర్నీని బహిష్కరించే అవకాశాలు చాలా తక్కువని పీసీబీ (PCB) వర్గాలు చెబుతున్నాయి. బంగ్లాదేశ్ తప్పుకున్న నేపథ్యంలో పాకిస్థాన్ నిర్ణయంపై ఆసక్తి నెలకొన్నా, ఐసీసీతో సంబంధాలను దృష్టిలో పెట్టుకుని వారు పాల్గొనడానికే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
స్పిన్ మంత్రంతోనే గెలుస్తాం!
ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో 168 పరుగులను కాపాడుకున్న తీరుపై సల్మాన్ సంతృప్తి వ్యక్తం చేశారు. "మా స్పిన్ బౌలింగ్ విభాగం చాలా పటిష్టంగా ఉంది. 170 పరుగులు చాలని మాకు తెలుసు. ఆస్ట్రేలియా బ్యాటర్లను స్పిన్నర్లు తిప్పికొట్టారు" అని కెప్టెన్ ధీమా వ్యక్తం చేశారు.