T20 World Cup 2026: టీ20 ప్రపంచకప్ 2026 రసవత్తర దశకు చేరుకుంది. సూపర్-8 పోరులో భాగంగా జింబాబ్వేపై వెస్టిండీస్ సాధించిన భారీ విజయం ఇప్పుడు టీమిండియాకు కొత్త తలనొప్పులు తెచ్చి పెట్టింది. ఏకంగా 107 పరుగుల భారీ తేడాతో విండీస్ జయకేతనం ఎగురవేయడంతో గ్రూప్-2లో పాయింట్ల పట్టిక ఒక్కసారిగా మారిపోయింది. ఇప్పటికే దక్షిణాఫ్రికా చేతిలో ఘోర పరాజయాన్ని మూటగట్టుకున్న టీమిండియాకు ఈ రిజల్ట్ సెమీఫైనల్ దారిని మరింత ముళ్లమయం చేసింది. రన్ రేట్ పరంగా విండీస్ ఆకాశమే హద్దుగా దూసుకుపోతుండటంతో భారత్ ఇప్పుడు కేవలం గెలిస్తే సరిపోదు.. భారీ విజయాలను నమోదు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
భారత్ సెమీస్ చేరాలంటే?
దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 76 పరుగుల తేడాతో ఓడిపోవడం భారత్ నెట్ రన్ రేట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ప్రస్తుతం టీమిండియా రన్ రేట్ -3.800 వద్ద ఉండగా.. వెస్టిండీస్ +5.350తో అత్యంత పటిష్ట స్థితిలో ఉంది. సూపర్-8 గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచే రెండు జట్లు మాత్రమే సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తాయి. ఈ నేపథ్యంలో భారత్ సెమీస్ చేరాలంటే తర్వాతి రెండు మ్యాచ్‌ల్లో (జింబాబ్వే, వెస్టిండీస్‌పై) ఖచ్చితంగా గెలవాలి. ఒకవేళ దక్షిణాఫ్రికా తన మిగిలిన మ్యాచ్‌ల్లో కూడా విజయం సాధిస్తే.. భారత్ రన్ రేట్‌తో సంబంధం లేకుండా రెండో జట్టుగా సెమీస్ చేరుతుంది. కానీ సమీకరణాలు మారితేనే అసలు సమస్య మొదలవుతుంది.

ఇలా జరిగితే..?
ఒకవేళ భారత్ తన రెండు మ్యాచ్‌లు గెలిచి,, దక్షిణాఫ్రికా జట్టు వెస్టిండీస్ చేతిలో ఓడిపోతే.. అప్పుడు భారత్, వెస్టిండీస్, దక్షిణాఫ్రికా మూడు జట్లు నాలుగేసి పాయింట్లతో సమానంగా నిలుస్తాయి. అటువంటి క్లిష్ట పరిస్థితి తలెత్తితే, నెట్ రన్ రేట్ ఆధారంగానే సెమీస్ జట్లను నిర్ణయిస్తారు. ప్రస్తుతం విండీస్, సౌతాఫ్రికా రన్ రేట్లు భారత్ కంటే చాలా మెరుగ్గా ఉన్నాయి. ఈ భారీ వ్యత్యాసాన్ని పూడ్చుకోవాలంటే జింబాబ్వేతో జరగబోయే తర్వాతి మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు, బౌలర్లు అద్భుతాలు చేయాల్సి ఉంటుంది. కేవలం విజయం మాత్రమే కాకుండా, భారీ స్కోర్లు సాధించి ప్రత్యర్థిని తక్కువ పరుగులకే కట్టడి చేయడం భారత్‌కు అత్యవసరం.
భారత జట్టుకు అసలైన అగ్నిపరీక్ష
మార్చి 1న వెస్టిండీస్‌తో జరగబోయే చివరి సూపర్-8 మ్యాచ్ భారత జట్టుకు అసలైన అగ్నిపరీక్షగా మారనుంది. కరీబియన్ జట్టు ప్రస్తుతం భీకరమైన ఫామ్‌లో ఉంది. ఆ జట్టులోని ఆటగాళ్లందరికీ ఐపీఎల్ వల్ల భారత పిచ్‌లపై అపారమైన అనుభవం ఉంది. వరుసగా ఐదు విజయాలతో దూసుకుపోతున్న విండీస్ పవర్ హిట్టర్లను అడ్డుకోవడం సూర్య సేనకు అంత సులభం కాదు. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ వ్యూహాలు, ఆటగాళ్ల సమష్టి కృషి తోడైతేనే టీమిండియా ఈ గండం నుంచి గట్టెక్కి సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. భారత అభిమానులంతా ఇప్పుడు జింబాబ్వే మ్యాచ్‌లో టీమిండియా పుంజుకోవాలని ఆశిస్తున్నారు.