టీ20 వరల్డ్ కప్ 2026 సమరానికి సమయం దగ్గరపడింది. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి కేవలం వారం రోజుల సమయం మాత్రమే ఉన్న తరుణంలో టీమిండియాకు అదిరిపోయే న్యూస్ అందించింది. గాయాల కారణంగా జట్టుకు దూరమైన యువ ప్లేయర్లు తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్ మళ్లీ బ్యాట్, బాల్ పట్టేందుకు సిద్ధమైపోయారు. వీళ్లిద్దరూ వరల్డ్ కప్ టీమ్‌లో ఉండటం దాదాపు ఫిక్స్ అవ్వడంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
తిలక్ వర్మ ఈజ్ బ్యాక్!
తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు ఇటీవల పొట్ట కండరాల గాయం అయ్యి సర్జరీ జరిగిన సంగతి తెలిసిందే. దాంతో బెంగళూరులోని ఎన్‌సీఏ (NCA)లో ఉండి కోలుకుంటున్నాడు. న్యూజిలాండ్‌తో జరుగుతున్న చివరి రెండు టీ20ల్లో ఆయన ఆడతారని భావించినప్పటికీ.. ముందుజాగ్రత్తగా విశ్రాంతినిచ్చి శ్రేయస్ అయ్యర్‌ను జట్టులోకి తీసుకున్నారు. తిలక్ వర్మ పూర్తి ఫిట్‌నెస్ సాధించినట్లు తెలుస్తోంది. శుక్రవారం జరిగిన ఒక ప్రాక్టీస్ మ్యాచ్‌లో కూడా ఆయన పాల్గొన్నారు. ఫిబ్రవరి 3న ముంబైలో టీమిండియా జట్టుతోతిలక్ కలిసే అవకాశం ఉంది.

వాషింగ్టన్ సుందర్ పరిస్థితి ఏమిటి?
వాషింగ్టన్ సుందర్ అంటేనే పవర్ ప్లే స్పెషలిస్ట్. అయితే పక్కటెముకల గాయం వల్ల ఈ మధ్య ఇబ్బంది పడ్డాడు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సుందర్ ఇప్పటికే బ్యాటింగ్ ప్రాక్టీస్ మొదలెట్టేశాడు. మరో రెండు రోజుల్లో బౌలింగ్ కూడా షురూ చేస్తాడు. టీమిండియా జట్టులో ఉన్న ఏకైక ప్రాపర్ ఆఫ్ స్పిన్నర్ ఇతనే! కుల్దీప్, వరుణ్ చక్రవర్తి ఉన్నా.. పవర్ ప్లేలో వికెట్లు తీయాలంటే సుందర్ ఉండాల్సిందే. అందుకే వాషింగ్టన్ సుందర్ కోలుకోవడానికి సమయం పట్టినా జట్టులోనే ఉంచాలని మేనేజ్మెంట్ నిర్ణయించింది.
వరల్డ్ కప్ ప్లాన్.. ఇక పాకిస్థాన్‌తో వేటే!
న్యూజిలాండ్‌తో సిరీస్ అవ్వగానే భారత జట్టు ముంబై వెళ్లనుంది. అక్కడ రెండు ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడి అసలైన సమరానికి రెడీ అవుతారు. ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగే మ్యాచ్‌తో భారత్ తన ప్రపంచకప్ వేటను ప్రారంభిస్తుంది. ఒకవేళ వాషింగ్టన్ సుందర్ తొలి మ్యాచ్‌కు అందుబాటులో లేకపోయినా.. ఫిబ్రవరి 15న పాకిస్థాన్‌తో జరిగే హై-వోల్టేజ్ మ్యాచ్ నాటికి ఆయన పూర్తి స్థాయిలో సిద్ధమవుతారని టీమ్ మేనేజ్మెంట్ నమ్మకంగా ఉంది. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై వాషింగ్టన్ సుందర్ పాత్ర అత్యంత కీలకం కానుంది.