T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభానికి ముందే అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) ఓ సంచలన నిర్ణయం తీసుకుంది.భారత్, శ్రీలంక వేదికలుగా ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్ 2026లో అనూహ్య మార్పు చోటుచేసుకుంది. బంగ్లాదేశ్ జట్టును మెగా టోర్నీ నుంచి బహిష్కరించి ఆ స్థానాన్ని స్కాట్లాండ్ జట్టుకు కేటాయించింది. బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టు ఈ మెగా టోర్నీలోకి ఎంట్రీ ఇచ్చింది.
ఐసీసీ నిబంధనల విషయంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డుకు, ఐసీసీకి మధ్య గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోంది. ఐసీసీ విధానాలను పాటించాలని బంగ్లాదేశ్‌కు 24 గంటల గడువు ఇచ్చింది. అయినప్పటికీ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో ఐసీసీ సీఈఓ సంజోగ్ గుప్తా ఈ కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. బంగ్లాదేశ్ డిమాండ్లు ఐసీసీ పాలసీకి విరుద్ధంగా ఉన్నాయని ఆయన స్పష్టం చేశారు.

స్కాట్లాండ్‌కు ఎందుకు అవకాశం ఇచ్చారంటే?
ప్రస్తుత టీ20 ర్యాంకింగ్స్‌లో 14వ స్థానంలో ఉండటం, గత ప్రపంచకప్‌లలో స్కాట్లాండ్ చూపిన అత్యుత్తమ ప్రదర్శనల ఆధారంగా ఐసీసీ ఆ జట్టును ఎంపిక చేసింది. గ్రూప్ బీలో ఇంగ్లండ్‌తో సమానంగా పాయింట్లు సాధించినప్పటికీ, రన్ రేట్ తక్కువగా ఉండటంతో తృటిలో తదుపరి రౌండ్ అవకాశం కోల్పోయింది. 2022లో వెస్టిండీస్‌ను, 2021లో బంగ్లాదేశ్‌ను ఓడించి స్కాట్లాండ్ సంచలనం సృష్టించింది.
బంగ్లాదేశ్ స్థానాన్ని భర్తీ చేసిన స్కాట్లాండ్ గ్రూప్-సీలో ఉంటుంది. ఈ గ్రూపులో ఇంగ్లండ్, వెస్టిండీస్, ఇటలీ, నేపాల్ జట్లు ఉన్నాయి.
ఫిబ్రవరి 7: వెస్టిండీస్‌తో (కోల్‌కతా)
ఫిబ్రవరి 9: ఇటలీతో (కోల్‌కతా)
ఫిబ్రవరి 14: ఇంగ్లండ్‌తో (కోల్‌కతా)
తర్వాతి మ్యాచ్: నేపాల్‌తో (ముంబై)