T20 World Cup 2026: వచ్చే నెలలో భారత్, శ్రీలంక వేదికగా ప్రారంభం కానున్న ఐసీసీ పురుషుల టీ20 వరల్డ్ కప్ 2026 కోసం ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తమ 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. ఆస్ట్రేలియా జట్టుకు స్టార్ ఆల్‌రౌండర్ మిచెల్ మార్ష్ నాయకత్వం వహించనున్నారు. ఈ సారి జట్టులో ముగ్గురు ఆటగాళ్లు తొలిసారిగా టీ20 ప్రపంచ కప్‌లో అరంగేట్రం చేయబోతున్నారు. యువ స్పిన్నర్ మాథ్యూ కుహ్నెమాన్, ఆల్‌రౌండర్ కూపర్ కాన్లీ, ఫాస్ట్ బౌలర్ జేవియర్ బార్ట్‌లెట్ తమ ప్రతిభను నిరూపించుకునేందుకు సిద్ధమయ్యారు. భారత పిచ్‌ల పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఈ ఎంపికలు జరిగినట్లు తెలుస్తోంది.
ఆస్ట్రేలియా జట్టు ఇదే..
మెజారిటీ అనుభవజ్ఞులతో కూడిన ఈ జట్టు చాలా సమతుల్యంగా కనిపిస్తోంది.
ఆస్ట్రేలియా జట్టు: మిచెల్ మార్ష్(కెప్టెన్), ట్రావిస్ హెడ్, గ్లెన్ మాక్స్‌వెల్, కామెరాన్ గ్రీన్, మార్కస్ స్టోయినిస్, టిమ్ డేవిడ్, జోష్ ఇంగ్లిస్ (కీపర్), పాట్ కమిన్స్, జోష్ హేజిల్‌వుడ్, ఆడమ్ జంపా, నాథన్ ఎల్లిస్, మాథ్యూ షార్ట్, జేవియర్ బార్ట్లెట్, కూపర్ కానలీ, మాథ్యూ కుహ్నెమాన్.

ఆస్ట్రేలియా షెడ్యూల్, గ్రూప్ వివరాలు
ఈ మెగా టోర్నీలో ఆస్ట్రేలియా గ్రూప్-బి లో ఉంది. ఈ గ్రూప్‌లో ఆస్ట్రేలియాతో పాటు శ్రీలంక, జింబాబ్వే, ఒమన్, ఐర్లాండ్ జట్లు ఉన్నాయి.
ఫిబ్రవరి 11: ఐర్లాండ్‌తో తొలి మ్యాచ్ (కొలంబో).
ఫిబ్రవరి 13: జింబాబ్వేతో పోరు.
ఫిబ్రవరి 16: శ్రీలంకతో కీలక పోరు.
ఫిబ్రవరి 20: ఒమన్‌తో చివరి లీగ్ మ్యాచ్.
టోర్నీ ఫార్మాట్
ఈసారి ప్రపంచ కప్‌లో మొత్తం 20 జట్లు పాల్గొంటున్నాయి. వీటిని నాలుగు గ్రూపులుగా విభజించారు. ప్రతి గ్రూప్ నుంచి మొదటి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సూపర్-8 దశకు చేరుకుంటాయి. అక్కడి నుంచి నాకౌట్ పోరు మొదలవుతుంది. భారత పిచ్‌లపై ఆడమ్ జంపా, మాక్స్‌వెల్, స్టోయినిస్ వంటి ఆటగాళ్లు కీలకం కానున్నారు.