టీ20 వరల్డ్ కప్-2024 వార్మప్ మ్యాచ్‌లో వెస్టిండీస్ బ్యాటర్లు విధ్వంసం సృష్టించారు. ట్రిండాడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో విండీస్ 35 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు వెస్టిండీస్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్లకు 257 పరుగులు చేసింది. నికోలస్ పూరన్ 25 బంతుల్లో 75 పరుగులు చేశాడు. అయిదు ఫోర్లు, ఎనిమిది సిక్సర్లు బాదాడు.
కెప్టెన్ పావెల్ (52; 25 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు), రూథర్‌ఫర్డ్ (47 నాటౌట్; 18 బంతుల్లో, 4 ఫోర్లు, 4 సిక్సర్లు) దూకుడుగా ఆడారు. మూడో ఓవర్‌లో క్రీజులోకి వచ్చిన పూరన్ ఆది నుంచే దూకుడుగా ఆడాడు. ఎడాపెడా బౌండరీలతో విరుచుకుపడ్డాడు. 16 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఐపీఎల్ ప్లేఆఫ్స్ ఆడిన కారణంగా కీలక ఆటగాళ్లకు విశ్రాంతినివ్వడంతో చీఫ్ సెలక్టర్ జార్జి బెయిలీ, సహాయక కోచ్‌లు బ్రాడ్ హోడ్జ్, ఆండ్రీ బోర్‌వెక్ మరోసారి ఫీల్డింగ్‌కు వచ్చారు. అయితే పూరన్ క్యాచ్‌ను బోర్‌వెక్ జారవిడిచాడు.

ఆస్ట్రేలియా బౌలర్లలో జంపా రెండు, అగర్, టిమ్ డేవిడ్ చెరో వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో ఆసీస్ 20 ఓవర్లలో ఏడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. జోస్ ఇంగ్లిష్ (55; 30 బంతుల్లో, 5 ఫోర్లు, 4 సిక్సర్లు)టాప్ స్కోరర్. నాథన్ ఎలిస్ (39; 22 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆస్టన్ అగర్ (28; 13 బంతుల్లో, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), టిమ్ డేవిడ్ (25; 12 బంతుల్లో, 3 ఫోర్లు, 2 సిక్సర్లు), మాథ్యూ వేడ్ (25; 14 బంతుల్లో, 3 ఫోర్లు, 1 సిక్సర్) పరుగులు చేశారు.
ఈ మ్యాచ్‌తో ఆస్ట్రేలియా తమ వార్మప్ మ్యాచ్‌లను ముగించింది. కమిన్స్, మాక్స్‌వెల్, ట్రావిస్ హెడ్, మిచెల్ స్టార్క్, కామెరూన్ గ్రీన్‌కు విశ్రాంతి ఇవ్వడంతో పూర్తి జట్టుతో ఆసీస్ ప్రాక్టీస్ మ్యాచ్‌లు ఆడలేదు. కాగా, 'గ్రూప్-బి'లో ఆస్ట్రేలియాతో పాటు ఇంగ్లండ్, స్కాట్‌లాండ్, ఒమన్, నమీబియా ఉన్నాయి. ఆసీస్ తమ తొలి మ్యాచ్‌ను జూన్ 5న ఒమన్‌తో ఆడనుంది. జూన్ 2 నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే.