T20 World Cup 2024 India squad: ఐపీఎల్ 2024లో రసవత్తరంగా కొనసాగుతోంది. సగానికి పైగా టోర్నమెంట్ ముగిసింది. రాజస్థాన్ రాయల్స్ ప్లేఆఫ్స్‌కు మరింత చేరువ అయింది. ఎనిమిది విజయాలు- 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిందా జట్టు.
పదేసి చొప్పున పాయింట్లను సాధించిన కోల్‌కత నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, ఢిల్లీ కేపిటల్స్.. ఆ తరువాతి స్థానాల్లో ఉన్నాయి. ఒక్క విజయం సాధించితే చెన్నై సూపర్ కింగ్స్ కూడా వీటి సరసన చేరుతుంది. నాలుగు జట్లు మాత్రమే అర్హత సాధించాల్సిన ప్లేఆఫ్స్ రేసు ఉత్కంఠభరితంగా మారింది.

ఈ సీజన్ ముగిసిన వెంటనే టీ20 వరల్డ్ కప్‌కు రెడీ అవుతుంది టీమిండియా. వెస్టిండీస్, అమెరికా ఈ మెగా టోర్నమెంట్‌కు సంయుక్తంగా ఆతిథ్యాన్ని ఇవ్వనున్నాయి. జూన్ 4వ తేదీన టోర్నమెంట్ ఆరంభమౌతుంది. 30 వరకు కొనసాగుతుంది. వెస్టిండీస్, అమెరికాల్లో మొత్తంగా ఏడు స్టేడియాల్లో మ్యాచ్‌లు షెడ్యూల్ కానున్నాయి. డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్.. ఇందులో ఉన్నాయి.
ఈ సారి ఏకంగా 20 జట్లు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2024లో ఆడబోతోన్నాయి. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ నిర్వహించే ఓ టోర్నమెంట్‌లో ఒక్క టైటిల్ కోసం 20 జట్లు పోటీ పడటం ఇదే తొలిసారిగా చెప్పుకోవచ్చు. ఇంత పెద్ద మెగా ఈవెంట్‌లో భారత జట్టులో ఎవరికి చోటు లభిస్తుందనేది హాట్ టాపిక్‌గా మారింది.
టీ20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టును మే 1వ తేదీన ప్రకటించబోతోంది భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్. దీనిపై ఇప్పటికే ఓ ఫార్మల్ మీటింగ్ సైతం ముగిసింది. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కేప్టెన్ రోహిత్ శర్మ ఇప్పటికే దేశ రాజధానిలో సమావేశం అయ్యారు కూడా. వరల్డ్ కప్ ఆడబోయే 15 మంది ప్లేయర్లతో కూడిన జట్టుపై ఓ నిర్ణయానికి వచ్చారు. మే 1వ తేదీన అధికారికంగా జట్టును ప్రకటించనున్నారు.
గడువు సమీపించిన నేపథ్యంలో- భారత జట్టుపై అంచనాలు వ్యక్తమౌతోన్నాయి. లెజెండరీలు, టీమిండియా మాజీ ప్లేయర్లు, స్పోర్ట్స్ కామెంటేటర్లు.. టీమిండియాలో ఆడబోయే ప్లేయర్ల గురించి తమ అభిప్రాయాలను వెల్లడిస్తోన్నారు. జట్టు కూర్పు ఎలా ఉండబోతోంది? ఎలా ఉంటే కప్‌ను సాధించగలుగుతుందని స్పష్టం చేస్తోన్నారు.
ఇప్పటికే బీసీసీఐ మాజీ చీఫ్ సెలెక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్.. తన అంచనాలను వెల్లడించిన విషయం తెలిసిందే. రోహిత్ శర్మ సారథ్యాన్ని వహించే భారతజట్టులో యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, శివమ్ దుబే, రింకూ సింగ్, రిషభ్ పంత్, మయాంక్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని చెప్పుకొచ్చారు.
ఇప్పుడు తాజాగా టీమిండియా మాజీ ప్లేయర్ వసీం జాఫర్.. భారత జట్టు కూర్పుపై తన అంచనాలను వెల్లడించారు. రోహిత్ శర్ (కేప్టెన్), యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్ (వికెట్ కీపర్), శివమ్ దుబే, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్, మహ్మద్ సిరాజ్, యజువేంద్ర చాహల్, సంజు శాంసన్‌ను జట్టులోకి తీసుకుంటే బాగుంటుందని పేర్కొన్నారు.