టీ20 ప్రపంచకప్‌లో హ్యాట్రిక్ విజయాలతో భారత్ సూపర్-8కు అర్హత సాధించింది. బుధవారం నాసా కౌంటీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో అమెరికాపై ఏడు వికెట్ల తేడాతో నెగ్గి తదుపరి దశకు చేరింది.మొదట యునైటెడ్ స్టేట్స్ నిర్ణీత 20 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 110 పరుగులు చేసింది. నితీశ్ కుమార్ (27; 23 బంతుల్లో, 2 ఫోర్లు, 1 సిక్సర్) టాప్ స్కోరర్.
స్టీవెన్ టేలర్ (24; 30 బంతుల్లో, 2 సిక్సర్లు) ఫర్వాలేదనిపించాడు. అర్షదీప్ సింగ్ (4/9) నాలుగు వికెట్లతో విజృంభించాడు. హార్దిక్ పాండ్య (2/14) రెండు, అక్షర్ పటేల్ (1/25) ఒక వికెట్ తీశారు. అనంతరం ఛేదనలో భారత్ 18.2 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది. అయితే ఛేజింగ్ ఆరంభంలోనే స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లి (గోల్డెన్ డకౌట్), రోహిత్ శర్మ (3; 6 బంతుల్లో) ఔటయ్యారు.

ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్యకుమార్ యాదవ్ (50 నాటౌట్, 49 బంతుల్లో, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) తన శైలికి భిన్నంగా స్లోగా ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. శివమ్ దూబె (31 నాటౌట్; 35 బంతుల్లో, 1 ఫోర్, 1 సిక్సర్) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అయితే గొప్పగా పోరాడినప్పటికీ తమ జట్టు గెలుపు అందుకోలేదనే బాధతో అమెరికా కెప్టెన్ ఆరోన్ జోన్స్ నిరుత్సాహంగా కనిపించాడు. దీన్ని గమనించిన సూర్యకుమార్ జోన్స్ దగ్గరకు వెళ్లి ఓదార్చాడు.
అమెరికా చూపించిన పోరాట పటిమను కొనియాడుతూ ఆరోన్ జోన్స్‌కు సూర్య ధైర్యం చెప్పాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కాగా, జోన్స్ స్టాండిన్ కెప్టెన్‌గా జట్టు బాధ్యతలు అందుకున్నాడు. మోనాంక్ పటేల్ గాయపడటంతో భారత్‌తో మ్యాచ్‌కు కెప్టెన్సీ వహించాడు. బౌలర్లను గొప్పగా ఉపయోగించుకుని మ్యాచ్‌ను ఆఖరి వరకు తీసుకువచ్చాడు. కాగా, శుక్రవారం ఐర్లాండ్‌తో జరగాల్సిన మ్యాచ్‌లో విజయం సాధిస్తే అమెరికా సూపర్-8కు చేరుకుంటుంది. ఒకవేళ ఐర్లాండ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైనా యునైటెడ్ స్టేట్స్ తదుపరి దశకు అర్హత సాధిస్తుంది.