టీ20 క్రికెట్ అంటే సాధారణంగా అందరూ కోరుకునేది ధనాధన్ బ్యాటింగ్. బ్యాటర్ల విధ్వంసంతో స్టాండ్స్‌లోని ప్రేక్షకులు ఫీల్డర్లుగా మారిపోతే... ఆ అనుభూతి వేరుగా ఉంటుంది. అందుకే పొట్టి ఫార్మాట్‌లో ఎక్కువగా ఫ్లాట్ పిచ్ సిద్ధం చేస్తుంటారు. ఇక కొందరు అభిమానులు మాత్రం టీ20ల్లోనూ బ్యాటుకు బంతికి సమానమైన పోటీ ఉండాలని భావిస్తుంటారు. అప్పుడే అసలు మజా వస్తుందని అంటుంటారు.
బ్యాటింగ్-బౌలింగ్‌కు సమానంగా అనుకూలించే పిచ్‌లపై 160 స్కోరు కూడా ఉత్కంఠ పోరుగా సాగుతుంటుంది. ప్రతి బౌలర్ కూడా పిచ్ నుంచి ఆశించేది ఇదే. కానీ బ్యాటర్లపై బౌలర్లు ఆధిపత్యం చెలాయించేలా పిచ్ ఉంటే.. టీ20 ఫార్మాట్ రుచినే పోతుంది. ప్రస్తుతం టీ20 వరల్డ్ కప్‌లో అదే పరిస్థితి నెలకొంది. తొలిసారి ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చిన అమెరికాలో డ్రాప్‌ఇన్ పిచ్‌లు పేలవమైన రికార్డులకు వేదికగా మారింది.

110+ స్కోరే కొండంత లక్ష్యంగా దిగ్గజ బ్యాటర్లకే మారిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే అమెరికాలో లీగ్ దశ మ్యాచ్‌లు మాత్రమే జరగనున్నాయి. సూపర్-8 నుంచి మెగాటోర్నీ ఫైనల్ వరకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇవ్వనుంది. అయితే విండీస్‌లోని పిచ్‌లు కూడా స్లోగానే ఉన్నాయి. కరేబియన్ దీవుల్లో జరిగిన లీగ్ స్టేజ్ మ్యాచ్‌ల్లో కూడా స్వల్ప స్కోరులే నమోదయ్యాయి. దీంతో ప్రస్తుతం టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికీ 29 మ్యాచ్‌లే అయినప్పటికీ కోరుకోని రికార్డు నమోదైంది.
100 కంటే తక్కువ స్కోర్లు అత్యధికసార్లు నమోదైన టీ20 వరల్డ్ కప్‌గా '2024 ప్రపంచకప్' రికార్డు సృష్టించింది. ఈ టోర్నీలో ఇప్పటివరకు తొమ్మిది సార్లు 100 కంటే తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. ఇందులో ప్రత్యర్థి జట్లను అఫ్గానిస్థాన్ మూడు సార్లు సెంచరీ కొట్టకుండా కట్టడి చేయడం విశేషం. ఉగాండను 58 పరుగులకు, న్యూజిలాండ్‌ను 75, పపువా న్యూ గినియాను 95 పరుగులకే ఆలౌట్ చేసింది.
అంతకుముందు 100 కంటే తక్కువ స్కోర్లు నమోదైన టీ20 వరల్డ్ కప్‌లుగా 2014, 2021 టోర్నీలు నిలిచాయి. ఈ రెండు ప్రపంచకప్‌ల్లో ఎనిమిది సార్లు 100 కంటే తక్కువ స్కోర్లు నమోదయ్యాయి. 2014 వరల్డ్ కప్‌కు బంగ్లాదేశ్, 2021 ప్రపంచకప్‌కు దుబాయ్ ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే.